సిరిసిల్లలో దారుణం... వికలాంగ బాలికపై యూపీ వ్యక్తి అత్యాచారం...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. వికలాంగురాలైన ఓ మైనర్ బాలికపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశంతో అతనిపై దాడి చేశారు. అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్ వాసిగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన చతుర్ సింగ్(28) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం ఎల్లారెడ్డిపేట మండలంలోని బండాలింగపూర్ గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. స్థానికంగా చాట్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇదే క్రమంలో ఆదివారం(జనవరి 31) బండాలింగాపూర్‌కి చెందిన వికలాంగురాలైన ఓ మైనర్ బాలికను అతను గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలిక కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులంతా ఆమె కోసం వెతికారు. చివరకు గ్రామ శివారులో చతుర్ సింగ్ కనిపించడంతో అతన్ని పట్టుకున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసి అతనిపై దాడి చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదే సిరిసిల్ల జిల్లాలో సోమవారం(ఫిబ్రవరి 1) ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించిన ఘటన వెలుగుచూసింది. తంగళ్లపల్లి మండలానికి చెందిన రాజు, నిచిత (16) అనే టీనేజీ యువతి,యువకుడు మానేరు వాగులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే పెట్రోలింగ్ పోలీసులు గమనించి వారిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. తమ వివాహానికి పెద్దలు అడ్డు చెప్పడంతోనే ప్రేమజంట ఆత్మహత్యాతయ్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.