బుల్డోజర్ లతో విధ్వంసం చేస్తారా? బీజేపీ దీక్షలు, బుల్డోజర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బాల్క సుమన్
టిఆర్ఎస్ పార్టీ వైఖరిపై, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై, తెలంగాణ అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన విధానం పై తమ నిరసన తెలియజేస్తూ బిజెపి ఎమ్మెల్యేలు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షలో మాట్లాడిన రాజాసింగ్ తెలంగాణ రాష్ట్రానికి బుల్డోజర్ లు వస్తున్నాయని, కెసిఆర్ అవినీతిని బుల్డోజర్ లతో తొలగిస్తామని రాజా సింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కేసీఆర్ పై బీజేపీ నేతల కండకావరం
బిజెపి నేతలు ఇందిరాపార్క్ దగ్గర చేసిన దీక్ష లో టిఆర్ఎస్ మీద చేసిన విమర్శలు అర్థరహితమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఏదో తెలంగాణ రాష్ట్రంలోనే మొదలైనట్టు బిజెపి నేతలు నీతులు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. బిజెపికి రాష్ట్రప్రభుత్వాలు లేవా? స్పీకర్లు లేరా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం లేదా? అని ప్రశ్నించిన బాల్క సుమన్ బిజెపి ఎమ్మెల్యేలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసమే దీక్షలు చేస్తున్నారని కెసిఆర్ పై బిజెపి నేతలు కండకావరంతో మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.

బుల్డోజర్ లతో విధ్వంసం చేస్తారా?
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష నేతల సస్పెన్షన్ వివాదాలను దేశమంతా చూసిందని ఆరోపించారు. బిజెపి బుల్డోజర్ భాష వాడుతూ పల్లెల్లో విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను చంపడం కోసం బుల్డోజర్ ల భాష వాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతల విధానం విధ్వంసం అని మా విధానం వికాసం అని బాల్క సుమన్ పేర్కొన్నారు.

బిజెపి బుల్డోజర్ లతో ప్రజలను తొక్కించాలని చూస్తోంది
తాము కల్యాణ లక్ష్మి చెక్కులు పంచుతుంటే, బిజెపి బుల్డోజర్ లతో ప్రజలను తొక్కించాలని చూస్తోందని బాల్క సుమన్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆసుపత్రికి వెళితే కూడా మానవత్వం లేకుండా బిజెపి నేతలు విమర్శలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులు గురించి మాట్లాడే హక్కు బిజెపికి లేదని పేర్కొన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద్యమ ద్రోహులు అయితే తెలంగాణ ప్రజలు వారిని ఎందుకు గెలిపించారని ప్రశ్నించారు.

మేం మోడీని, అమిత్ షా ను అసభ్యంగా తిట్టగలం
బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ ని తిడితే మేం కూడా పీఎం మోడీ ని, హోంమంత్రి అమిత్ షా ను అసభ్యంగా తిట్ట గలమని హెచ్చరించారు. ఎందుకు విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయడం లేదు అని ప్రశ్నించిన ఆయన మోడీ, అమిత్ షా ను చూస్తే బిజెపి నేతలకు లాగులు తడుస్తున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతలు అశాంతిని క్రియేట్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

బుల్డోజర్ రాజకీయాలు తెలంగాణలో నడవవు
ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర నాయకులకు ఊడిగం చేస్తే ఈరోజు తెలంగాణ బిజెపి నాయకులు గుజరాత్ నాయకులకు ఊడిగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. గుజరాత్ నాయకులు డైరెక్షన్లోనే తెలంగాణ నాయకులు పనిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతల దీక్షలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం ఇస్తామని చెప్పిన ఉద్యోగాల కోసం ఢిల్లీలో దీక్షలు చెయ్యాలని హితవు పలికారు. బుల్డోజర్ రాజకీయాలు తెలంగాణలో నడవవని ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications