రాజగోపాల్ రెడ్డిపై జీవన్ రెడ్డి ఫైర్; ఆపై ఇద్దరూ కలిసి అలా.. ఆసక్తికర సన్నివేశం!!
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఆర్మూర్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విరుచుకుపడ్డారు. జనరల్ హెల్త్ చెకప్ కోసం సీఎం కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారని, కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసి ఆసుపత్రికి పోయారని చెప్పడం సిగ్గుచేటని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చిన్న మెదడు చితికి పోయిందేమో
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చిన్న మెదడు చితికి పోయిందేమో అందుకే చిల్లర మాటలు మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజగోపాల్ రెడ్డి ఒక కుసంస్కారి అని, ఆయనకు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని మండిపడ్డారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బిజెపిలు గెలిస్తే తమకేంటి ఓడితే తమకేంటి అని వ్యాఖ్యానించిన జీవన్ రెడ్డి ఆ రెండు పార్టీలు కట్టగట్టుకుని ఎక్కడైనా దూకి చస్తే తమకేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ ను అంత మాటంటావా?
సీఎం కేసీఆర్ గుండె ఉక్కు అంటూ పేర్కొన్న ఆయన కోట్లాది మంది ప్రజల అభిమానం పొందిన గుండె అది అంటూ వ్యాఖ్యానించారు. బిజెపి, కాంగ్రెస్ లను మట్టి కరిపించిన ఉక్కు గుండె కెసిఆర్ దని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ను అంత మాటంటావా ? మీ సంగతి చూస్తాం అంటూ మండిపడ్డారు. ఆపై సీఎల్పీ కార్యాలయం వద్ద తారసపడిన ఇరువురు నేతలు మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకున్నారు.

సీఎల్పీ కార్యాలయం ముందు మళ్ళీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ
మా గురించి చాలా మాట్లాడుతున్నావ్ ఏంటి అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ప్రశ్నించగా అవును మా బాస్ ను ఒక మాట అంటే మేం వంద మాటలు అంటాం అంటూ సమాధానమిచ్చారు జీవన్ రెడ్డి. తాను సీఎం కేసీఆర్ ను ఏమీ అనలేదని హెల్త్ బాగోలేదు అని చెబితే ఎన్నికల ఫలితాలు చూసి ఏమో అని మాత్రమే అన్నానని రాజగోపాల్ రెడ్డి జవాబిచ్చారు. అందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి తో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ అధినాయకత్వం నుండి ఉన్న ఆదేశాల మేరకే రాజగోపాల్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశాను అంటూ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఏం చేసినా అధికారంలోకి రాదన్న జీవన్ రెడ్డి
తెలంగాణ తీసుకువచ్చిన మమ్మల్ని తిడుతున్నారని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయగా, తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవి త్యాగం చేసినందుకు మీ కుటుంబం పై గౌరవం ఉందంటూ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తాము ఎప్పుడూ సోనియాగాంధీ పై విమర్శలు చేయమని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని మాత్రమే తిడుతున్నామంటూ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రాదని, తెలంగాణ రాష్ట్రంలో మరో 20 ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపై ఇరువురు నేతలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications