
సమతామూర్తి పేరుతో చిన్నజీయర్ స్వామి చేస్తుందిదే.. ఎమ్మెల్యే సీతక్క సంచలన ఆరోపణలు!!
మేడారం సమ్మక్క, సారలమ్మలపై చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో దుమారంగా మారాయి. సమ్మక్క సారలమ్మలను గురించి చిన్న జీయర్ స్వామి చాలా చులకనగా మాట్లాడారని ఆదివాసీ గిరిజనులలో ఆందోళన వ్యక్తమవుతోంది.
చిన్నజీయర్ స్వామిపై సీతక్క తీవ్ర వ్యాఖ్యలు
తాజాగా చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైన సమ్మక్క-సారలమ్మల మీద చిన్న జీయర్ స్వామి అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. సమతా మూర్తి పేరుతో 120 కిలోల బంగారు విగ్రహాన్ని పెట్టి, అది చూడడానికి కూడా 150 రూపాయలు టికెట్టు పెట్టి చిన్న జీయర్ స్వామి వ్యాపారం చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. సమతా మూర్తి పేరుతో ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు అంటూ సీతక్క మండిపడ్డారు.

లక్ష రూపాయలు తీసుకోకుండా ఎప్పుడైనా పేదల ఇళ్ళకు వెళ్ళారా?
మేడారం సమ్మక్క సారలమ్మల దగ్గర ఎటువంటి టిక్కెట్టు లేదు అని, సమ్మక్క-సారలమ్మల దగ్గర ఎలాంటి వ్యాపారం జరగదని ఎమ్మెల్యే సీతక్క తేల్చి చెప్పారు. లక్ష రూపాయలు తీసుకోకుండా మీరు ఎప్పుడైనా పేద వాళ్ళ ఇంటికి వెళ్ళారా అని సీతక్క చిన్నజీయర్ స్వామి ని టార్గెట్ చేశారు. చిన్న జీయర్ స్వామి సమ్మక్క-సారలమ్మల పై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని, ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఆంధ్రా చిన్న జీయర్ స్వామి అంటూ మండిపడిన ఎమ్మెల్యే సీతక్క, భేషరతుగా తెలంగాణ సమాజానికి, ఆదివాసీ గిరిజనుల కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్న జీయర్ స్వామి అహంకారపూరిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు

చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి
ఇదిలా ఉంటే మేడారం సమ్మక్క సారలమ్మ ల పై చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. సమ్మక్క సారలమ్మ ల పై చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లోని పస్రా గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో చిన్న జీయర్ స్వామి సమ్మక్క సారలమ్మలను దేవతలు గా గుర్తించి ఎంతో మంది చదువుకున్న మేధావులు కూడా అజ్ఞానంలో జీవిస్తున్నారని చెప్పడం తన అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించటమేనని వారు మండిపడ్డారు.

చిన్నజీయర్ స్వామి మూర్ఖంగా మాట్లాడుతున్నారు : ఆదివాసీ గిరిజన సంఘం
ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైన ఆదివాసి గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అని వారు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నాలుగు రాష్ట్రాల నుండి కోటి మంది భక్తులు ఈ జాతరకు వస్తారని వారు పేర్కొన్నారు. చిన్న జీయర్ స్వామి మేడారం సమ్మక్క సారలమ్మలు కేవలం గ్రామ దేవతలు అంటూ, అంత పెద్ద ఎత్తున జాతర చేసి వారిని దేవతలుగా నమ్మడం చాలా చెడ్డ పని అని వనదేవతలను తక్కువచేసి మాట్లాడటం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. ఆయన తన స్థాయిని మరిచి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

మతిస్థిమితం లేని ఆరోపణలు చేస్తే వారి గుండెలపైకి గిరిజన బాణాలు ఎక్కుపెడతాం
శిస్తులు వద్దని యుద్ధం చేసిన వీరవనితలని, వారి సాహసాన్ని చులకన చేయడం దారుణమని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండిపడింది. లక్షల కోట్ల రూపాయలతో, టన్నులకొద్దీ వెండి, బంగారు ఆభరణాలతో విగ్రహారాధన చేసే మీరు ఆదివాసి దేవతలను చులకనగా మాట్లాడడం సమంజసం కాదని వారు అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ ఎవరైనా ఇలాంటి మతిస్థిమితం లేని ఆరోపణలు చేస్తే వారి గుండెల పైకి గిరిజన బాణాలు ఎక్కుపెడతాం అంటూ హెచ్చరించారు. చిన్న జీయర్ స్వామి తాను చేసిన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.