ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: రూ.100కోట్లు తీసుకోకుండా.. రిస్క్ చేశానన్న పైలెట్ రోహిత్‌రెడ్డి ఆడియో వైరల్!!
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బయటపెట్టిన నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పోలీస్ స్టేషన్లో మరో మారు ఫిర్యాదు చేశారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇక తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తాను పెద్ద రిస్కు తీసుకున్నానని టిఆర్ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడిన ఒక ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాజా షాకింగ్ వ్యాఖ్యలు
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తాను ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రిస్కు తీసుకున్నానని, లేదంటే 100 కోట్లు తీసుకుని నేను హ్యాపీగా ఉంటాను కదా అంటూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం మల్కన్ గిరి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆందోళన బాట పట్టారు.

మల్కన్ గిరిలో ఆందోళన చేస్తున్న యువకులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
గత వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సదరు యువకులతో మాట్లాడారు. దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతున్నానని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రిస్కు తీసుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కన్ గిరి గ్రామాభివృద్ధి ఏమేమి కావాలో తనకు పేపర్ మీద రాసి ఇస్తే, గ్రామాభివృద్ధి గురించి తాను చూసుకుంటానని పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో వైరల్
ప్రజల సమస్యలను తెలుసుకుంటే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్న ఆయన వారికి దీక్ష విరమించాలని సూచించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హామీ మేరకు మల్కన్ గిరి యువకులు దీక్షను నిర్మించుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, త్వరలో తమ గ్రామానికి 25 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లుగా యువకులు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారితో మాట్లాడిన ఫోన్ కాల్ తాలూకా ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
ఇదిలా ఉంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజులను డబ్బు ఆశ చూపి ప్రలోభపెట్టి , పార్టీ ఫిరాయింపు చేయాలని ప్రయత్నం జరిగినట్టు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామీజీలు ఎమ్మెల్యేలను ఫిరాయింపుకు ప్రోత్సహించినట్లు, వారితో మాట్లాడిన ఆడియోలు వీడియోలు సంచలనం రేపాయి. ఆ తర్వాత వారిపై కేసు నమోదు కావడం, కోర్టులలో కేసులు సంచలన విచారణ, ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, ప్రస్తుతం నిందితులు సిట్ విచారణను ఎదుర్కొంటున్న వ్యవహారం తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో తాజాగా పైలెట్ రోహిత్ రెడ్డి తను చాలా రిస్క్ తీసుకున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications