
ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్: ఆ వీడియోతో.. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నరేవంత్‌రెడ్డి
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి జరిగిన ప్రయత్నం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతలు బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి కుట్రలు చేస్తోందంటూ ఆందోళన చేస్తున్నారు. అయితే ఇది టిఆర్ఎస్ పార్టీ చేసిన కుట్ర అని, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కెసిఆర్ అని బీజేపీ నేతలు టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్ళపై స్పందించిన రేవంత్ రెడ్డి
ఇదిలా ఉంటే టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆసక్తికర ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోళ్లపై తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ బీజేపీ నేత ను టార్గెట్ చేశారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన బిజెపి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తమతో పలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో బిజెపి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేసిందని రేవంత్ రెడ్డి తన ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పారు.

రఘునందన్ రావు వీడియోను పోస్ట్ చేసి టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియోలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు బిజెపికి టచ్లో ఉన్నారని, వారంతా మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బిజెపిలో కచ్చితంగా చేరతారని ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ వారికి లంకె బిందెలు ఇచ్చినా, అరుంధతి బంగ్లాలో బంధించినా ఆ ఎమ్మెల్యేలంతా శృంఖలాలు తెంచుకొని మరీ బిజెపి తీర్థం పుచ్చుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారంలో మున్ముందు ఏం జరుగుతుందో?
ఇక తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడిన ఈ వీడియోను రేవంత్ రెడ్డి పోస్ట్ చేసి బిజెపి ని టార్గెట్ చేశారు. ఇక ఈ కొనుగోళ్ళ వ్యవహారంలో సీరియస్ గా ఉన్న టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతుంది. ఇక ఈ వ్యవహారం ముందు ముందు మరెంత ముదురుతుందో తెలియాల్సి ఉంది.