చంద్రబాబు, పవన్ కు మోదీ బిగ్ టాస్క్ - టార్గెట్ రేవంత్..!!
ఎన్డీఏ కూటమి ఎన్నికలు పూర్తవుతూనే కొత్త టార్గెట్స్ తో ముందు కెళ్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఏపీలో ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్రంలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నాయి. బీజేపీకి గతం కంటే సీట్లు తగ్గటంతో రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన మోదీ ఫోకస్ చేసారు. అందులో భాగంగా చంద్రబాబు, పవన్ ద్వారా మోదీ ఆపరేషన్ తెలంగాణ కు సిద్దమయ్యారు.
తెలంగాణ పై ఫోకస్
ఏపీలో చంద్రబాబుతో జత కట్టిన బీజేపీ అధికారంలో భాగస్వామి అయింది. ఏపీలో ఏకపక్షంగా కూటమి విజయం సాధించింది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల పైన చంద్రబాబు ఫోకస్ చేయనున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ టీడీపీకి ఇంకా కేడర్ ఉంది. ఏపీలో ఎన్నికల సమయంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో స్థిర పడిన ఏపీ ఓటర్లు మెజార్టీ సంఖ్యలో కూటమికి మద్దతుగా సొంత రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసారు. ఇక, తెలంగాణలో అసెంబ్లీ..పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పురోగతి సాధించింది. ఎనిమిది సీట్లు గెలుచుకుంది. దీంతో..దక్షిణాదిన ఇప్పుడు తెలంగాణ పైన బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

టీడీపీతో కలిసి పోటీ
తెలంగాణలో రాజకీయంగా బలపడాలనేది బీజేపీ లక్ష్యం. ఇందు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ కలిసి పోటీ చేసింది. ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ, ఒంటరిగా పోటీ చేసినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలుచుకుంది. దీంతో...పార్టీని రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతం చేసి..వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం పెంచుకోవాలనేది బీజేపీ వ్యూహం. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలు గెలుచుకుంది. కానీ, వచ్చే ఏడాది జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన తో కలిసి వెళ్లటం ద్వారా లక్ష్యం చేరుకుంటామని బీజేపీ భావిస్తోంది.
గ్రేటర్ పీఠం పై గురి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏపీ ప్రాంత వాసుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వచ్చే గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. పలువురిని పార్టీలో చేర్చుకుంది. గ్రేటర్ తో పాటుగా స్థానిక ఎన్నికల్లో విజయం రేవంత్ కు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అయితే, సికింద్రాబాద్ - మల్కాజ్ గిరి ఎంపీ స్థానాలు బీజేపీ గెలిచింది. బీజేపీకి ఉన్న మద్దతుకు టీడీపీ, జనసేన బలం తోడు అయితే గ్రేటర్ పీఠం దక్కటం ఖాయమని లెక్కలు వేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు తాజాగా తెలంగాణ లోనే పార్టీ బలోపేతం పైన చర్యలు మొదలు పెట్టారని చెబుతున్నారు. దీంతో..రేవంత్ లక్ష్యంగా బీజేపీ రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ తో కలిసి చేస్తున్న రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications