కేసీఆర్‌ది కాంగ్రెస్ రక్తం... ఇద్దరిదీ కుటుంబ పాలనే: మోడీ

Recommended Video

    Telangana Eections 2018 : కేసీఆర్‌ది కాంగ్రెస్ రక్తం... ఇద్దరిదీ కుటుంబ పాలనే : మోడీ | Oneindia

    నిజామాబాద్ : తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి నాందేడ్‌కు వచ్చిన ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకున్నారు. ఇందూరులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ టీఆర్ఎస్‌లపై నిప్పులు చెరిగారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి అక్కడికి వచ్చిన ప్రజలను మోడీ ఆకట్టుకున్నారు. సరస్వతీ ఆశీస్సులు పొందుతున్న ఇక్కడి ప్రజలు అదృష్టవంతులన్నారు. గోదావరి మంజీరా, హంద్రీ త్రివేణి సంగమం కలిసిన నేల పవిత్రమైనదని చెప్పిన ప్రధాని రజాకార్ల ఆగడాలను ధైర్యంగా ఎదరించిన చరిత్ర నిజామాబాద్‌కు ఉందని కొనియాడారు. అమరవీరుల కల సాకారం చేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ శుభాభివందనలు అంటూ తెలుగులో మాట్లాడారు ప్రధాని మోడీ.

    బడుగు బలహీన వర్గాలు కేసీఆర్‌ను ప్రశ్నించాల్సిన సమయమిది

    బడుగు బలహీన వర్గాలు కేసీఆర్‌ను ప్రశ్నించాల్సిన సమయమిది

    ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి ఎంతో మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని ప్రధాని మోడీ అన్నారు. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు ప్రధాని. నాలుగున్నర్ర ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణకు ఏమి చేసిందని మోడీ ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని మోడీ అన్నారు. ప్రభుత్వం ప్రతి పైసా లెక్క చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ సర్కార్ కాంగ్రెస్ తరహాలోనే అభివృద్ధి లేకుండా ఎన్నికలు గెలవాలని చూస్తోందని చెప్పిన ప్రధాని... ఆ కాలాలు మారిపోయాయని చెప్పారు. నిజామాబాద్‌ను లండన్‌గా మారుస్తామన్న కేసీఆర్ కనీస సదుపాయాలు కల్పించలేదని మోడీ ధ్వజమెత్తారు. నిజామాబాద్‌ను లండన్‌లా ఏవిధంగా మార్చారో తాను హెలికాఫ్టర్ నుంచి చూసినట్లు మోడీ ఎద్దేవా చేశారు. ఐదు సంవత్సరాలు పాలించేందుకు ప్రజలు ఎన్నుకుంటే...ముందే ఎన్నికలకు వెళుతున్నారని అన్నారు. ఇది కూడా ఒకందుకు మంచిదే అన్న ప్రధాని... ప్రజల కష్టాలు నాలుగున్నరేళ్లకే పరిమితమయ్యాయని అన్నారు.

    ఆయుష్మాన్ భారత్‌ పథకంకు కేసీఆర్ మద్దతు తెలపలేదు

    ఆయుష్మాన్ భారత్‌ పథకంకు కేసీఆర్ మద్దతు తెలపలేదు

    గోదావరి నీళ్లు ప్రతి ఇంటికి రాకపోతే ఓట్లు అడిగేందుకు రాను అని చెప్పిన ముఖ్యమంత్రి నీళ్లు ఇవ్వకపోగా... ఓట్లు మాత్రం అడిగేందుకు ప్రతి ఇంటికీ వస్తున్నారని విమర్శించారు మోడీ. నిజామాబాద్‌లో ఉండే వైద్యకళాశాలు పరిస్థితి అక్కడి విద్యార్థుల పరిస్థితి అద్వాన్నంగా ఉందని మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమానికి కేసీఆర్ అడ్డుపడ్డారని చెప్పారు. ఈ పథకం ద్వారా పేదవాడికి గుండె, కిడ్నీ లేదా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వం రూ. 5లక్షలు ఇస్తుందన్నారు ప్రధాని మోడీ. ఇప్పటికే ఈ పథకం ద్వారా మూడు లక్షల ప్రజలు లబ్ది పొందారని చెప్పారు. మోడీ తీసుకొస్తున్న ఈ పథకం ప్రజల్లోకి వెళితే తమను పట్టించుకోరనే అభద్రతా భావంలోకి కేసీఆర్ వెళ్లిపోయారని ప్రధాని అన్నారు. బీజేపీది ఒకటే మంత్రం ఉంటుందన్న మోడీ.. అది సబ్కా సాత్.. సబ్కా వికాస్ అన్నారు. అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఐదు సూత్రాలతోనే అభివృద్ధి చేస్తున్నామన్నారు ప్రధాని మోడీ.

     కేసీఆర్‌ది కాంగ్రెస్ రక్తం... కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు

    కేసీఆర్‌ది కాంగ్రెస్ రక్తం... కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు

    టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కేంద్రమంత్రిగా పనిచేశారు అని గుర్తు చేశారు మోడీ. కొన్నేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్యమంత్రి ఈరోజు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నమ్మవద్దని చెప్పారు. కాంగ్రెస్ టీఆర్ఎస్‌ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ ఉందని చెప్పారు. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తెలంగాణలో కుటుంబ పాలనపై గురించి మాట్లాడారన్న ప్రధాని...వారు అలా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. కొన్ని దశాబ్దాలు గాంధీ కుటుంబమే దేశాన్ని పాలించిందని ఇప్పుటు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం పాలిస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు అబద్ధమాడటంలో పోటీ పడుతున్నాయని మోడీ ధ్వజమెత్తారు.

    ఉజ్వల పథకం కింద 6కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు

    ఉజ్వల పథకం కింద 6కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు

    తన తల్లి కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే తాను ఏరకంగా ఇబ్బంది పడేదో ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పిన మోడీ... పేద మహిళలకు ఆ పరిస్థితి తలెత్తకూడదని భావించి తాను ప్రధాని అయ్యాక ఉజ్వల పథకం కింద 6 కోట్లు గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇచ్చినట్లు వెల్లడించారు. ఒక్క తెలంగాణలోనే 5 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. 2014 వరకు బ్యాంకు లూటీలు విరివిగా సాగిందన్న ప్రధాని...తమ ప్రభుత్వం వచ్చాక విదేశాల్లో దాచుకున్న డబ్బును కూడా తిరిగి భారత్‌కు తెప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అంతేకాదు బ్యాంకులకు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన వారిని భారత్‌కు రప్పిస్తామని చెప్పారు. తెలంగాణ పోరాటంలో చాలామంది యువకులను కాల్చి చంపిన ఇదే కాంగ్రెస్ పార్టీని మళ్లీ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు.

    అభివృద్ధి గురించి మాట్లాడే సత్తా కాంగ్రెస్‌కు లేదు

    తెలంగాణ నిర్మాణం అయ్యాక కేసీఆర్ నాశనం చేశారా లేదా అని మోడీ ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయ అక్షరాభ్యాసం కాంగ్రెస్‌లోనే జరిగిందని మోడీ గుర్తుచేశారు.కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాలపాటు దేశాన్ని పరిపాలించింది. అయితే ఇన్నేళ్లు పాలించిన ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడటం మానేసి... తన తల్లిని, కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారని చెప్పిన ప్రధాని... ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ మళ్లీ కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వడంలేదని ప్రధాని అన్నారు. చివరిగా భారత్‌మాతాకీ జై అనే నినాదంతో మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+