మోడీ మంచోడే కానీ.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలనం
బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేస్తూ మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వనపర్తి కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన-ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. వనపర్తి తనకు చదువుతోపాటు సంస్కారం నేర్పిందన్నారు. వనపర్తి విద్యార్థిగా తెలంగాణకు వన్నెతెచ్చాడనే కీర్తి తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు.
గతంలో వనపర్తి రాజకీయాల్లో కక్షలు, ధన ప్రభావం ఉండేది కాదని.. ఐదేళ్ల క్రితం ఇక్కడ్నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే రాజకీయాలు కలుషితం చేశారని రేవంత్ విమర్శించారు. పదేళ్లు తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్, 12 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోడీ రాష్ట్రానికి ఏం చేశారని రేవంత్ ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ. 21 వేల కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు సీఎం రేవంత్.

రూ. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. 65 లక్షల మంది మహిళలు స్వయంసహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. సభ్యుల సంఖ్య కోటికి చేర్చాలని ప్రయత్నిస్తున్నామన్నారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి మరో 15 ఏళ్లు.. 20 ఏళ్లు సీఎంగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. తమ బతుకు బస్టాండ్ అవుతుందని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారన్నారు.
పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు ఎండబెట్టారని బీఆర్ఎస్ నేతలను రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్లే కుప్పకూలిందని రేవంత్ ఆరోపించారు. పాలమూరు రైతు బిడ్డ సీఎం అయితే ఓర్వలేరా? అని కేటీఆర్, హరీశ్ రావు, కవితపై మండిపడ్డారు. మామునూరు ఎయిర్ పోర్ట్ ప్రధాని మోడీ ఇచ్చారు.. నేనే తెచ్చానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. మెట్రో రాలేదు.. మూసీ ప్రక్షాళనకు నిధులు రాలేదు.. ఆపింది మోడీనేనా అని రేవంత్ ప్రశ్నించారు.
నేను ఇటీవల ప్రధాని మోదీని కలిశాను, ఆయన తెలంగాణకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నారు. మోడీ తెలంగాణ పట్ల సానుభూతి తోనే ఉన్నాడు.. సమస్య మోడీ కాదు కిషన్ రెడ్డితో ఉంది. కిషన్ రెడ్డి తెలంగాణ మీద పగతో ఉన్నాడు - తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి.#TelanganaCongress#TelanganaRising pic.twitter.com/Q1ULSSfH45
— Revanth Reddy (@revanthreddy_67) March 2, 2025
తన కంటే చిన్నోడు రాష్ట్రానికి సీఎం అయ్యిండని కిషన్ రెడ్డికి కడుపుమంట అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మోడీ పాపం చాలా మంచిగానే ఉన్నారని.. ఆయన తెలంగాణకు ఎంతో కొంత చేయాలని ముందుకొస్తున్నారని రేవంత్ చెప్పారు. మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఏదైనా మంచి చేయాలనుకుంటున్నారు.. కానీ, కిషన్ రెడ్డినే ఓర్వలేక అడ్డుపడుతున్నారు. తెలంగాణకు సైంధవుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు అని రేవంత్ విమర్శించారు.
'నేను ఇటీవల ప్రధాని మోడీని కలిశాను, ఆయన తెలంగాణకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నారు. మోడీ తెలంగాణ పట్ల సానుభూతి తోనే ఉన్నాడు.. సమస్య మోడీ కాదు కిషన్ రెడ్డితో ఉంది. కిషన్ రెడ్డి తెలంగాణ మీద పగతో ఉన్నాడు' అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications