చురుగ్గా నైరుతి రుతుపవనాలు: ఐదు రోజులపాటు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆదివారంనాడు ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రిభువనగిరి, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇప్పటికే ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. కాగా, శనివారం కూడా హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నిజామాబాద్ లోని జగక్రాన్‌పల్లిలో 7 సెంటిమీటర్లు, మదనపల్లెలో 5.5, గద్వాలలోని ధరూర్ లో 5, నల్గొండలోని కనగల్ లో 4, సంగారెడ్డిలోని రాయికోడ్ లో 3.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఢిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా రుతుపవనాలు, వర్షాలు
మరోవైపు, ఢిల్లీతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో శనివారం వర్షం పడటంతో నగరవాసులు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు. దేశంలోని పలు రాష్ట్రాలకు కూడా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా వరకు నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. ఇప్పటికే అస్సాం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లక్షలాది మంది వరదలకు ప్రభావితమయ్యారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఇప్పటి వరకు వరదల కారణంగా నలుగురు మరణించారు.












Click it and Unblock the Notifications