గుండెను మెలిపెట్టే విషాదం: ఎంత పనిచేశావ్ తల్లి!..
కొడుకు స్పృహ తప్పిపోవడంతో తల్లడిల్లిపోయిన ఆ తల్లి.. అతను చనిపోయాడేమోనన్న పశ్చాత్తపంతో ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్: ఇదో విషాద ఘటన. కుమారుడిని సున్నితంగా మందలించే క్రమంలో.. అతని తలకు తీవ్ర గాయమైంది. అది చూసి తల్లడిల్లిపోయిన తల్లి.. కొడుకు స్పృహ తప్పిపోవడంతో మరింతగా కంపించిపోయింది. ఎంత ప్రయత్నించినా.. కుమారుడు స్పృహలోకి రాకపోవడంతో చనిపోయాడేమో అని భావించింది.
కన్న కొడుకునే బలిచేశానన్న పశ్చాత్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఆత్మహత్య తర్వాత కుమారుడికి స్పృహ రావడం.. చుట్టుపక్కల వారిని పిలవడం.. అప్పటికే సదరు మాతృమూర్తి ప్రాణాలు కోల్పోవడం.. అంతా ఓ విషాదంలా జరిగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబగాం గ్రామానికి చెందిన జి.సునీత(23), ఈశ్వరరావు దంపతులు. బంజారాహిల్స్ సమీపంలోని ఇందిరానగర్ లో నివసిస్తున్నారు. వీరికి ఏడేళ్ల కుమారుడు నిహార్, మరో కుమార్తె వున్నారు. సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఈశ్వర్ రెండు రోజుల క్రితం ఆయన విశాఖపట్టణం వెళ్లాడు.

ఇదే క్రమంలో.. గురువారం ఉదయం ఆడుకునేందుకని ఇంటినుంచి బయటకెళ్లిన నిహార్ ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ సునీత అన్నిచోట్ల గాలించింది. అయినా కుమారుడి జాడ కనిపించలేదు. దీంతో కుమారుడి కోసం ఏడుస్తూ ఇంటి బయటే కూర్చుండిపోయింది.
అలా కొద్దిసేపటి తర్వాత సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో నిహార్ ఇంటికొచ్చాడు. అప్పటికే కుమారుడి మీద ఆగ్రహంతో ఉన్న సునీత.. విసురుగా అతని చేయిపట్టుకుని వెళ్లి స్నానం చేయమని చెప్పింది. తల్లి మాటను నిహార్ చెవిన పెట్టలేదు. దీంతో అతని చేయి పట్టుకుని బలంగా లాగడంతో.. పక్కనే ఉన్న మంచంకోడు నిహార్ తలకు బలంగా తాకింది.
దీంతో తీవ్ర రక్తస్రావమై నిహార్ స్పృహ కోల్పోయాడు. ఎంతసేపు ప్రయత్నించినా.. కుమారుడు స్పృహలోకి రాకపోవడంతో.. నిహార్ ను తానే పొట్టనబెట్టుకున్నానని సునీత భావించింది. పశ్చాత్తాపంతో తనకు తానే శిక్ష విధించుకుంది. చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సునీత ఆత్మహత్య చేసుకున్న కొద్దిసేపటికి ఆమె కుమారుడు నిహార్ స్పృహలోకి వచ్చాడు. తల్లిని అలా చూసి గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు ఇంటిముందు గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications