ఇందుకేనా!: కేసీఆర్‌కు మోత్కుపల్లి అభినందనలు
నల్గొండ: తీవ్ర విమర్శలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తొలిసారి ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ప్రశంసా పూర్వక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
యాదాద్రిని జిల్లా చేస్తున్నందుకు కె చంద్రశేఖర్ రావుకు తెలుగుదేశం నేత మోత్కుపల్లి నర్సింహులు సోమవారం అభినందనలు తెలిపారు. సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని ఆయన దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ... యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కరుణించి ముఖ్యమంత్రి కేసీఆర్‌లో పుట్టించిన సంకల్పంతోనే యాదాద్రి జిల్లా ఏర్పడిందని అన్నారు. సోమవారం నోటిఫికేషన్ వెలువడ్డాక ఆయన తన అనుచరులతో ఈ క్షేత్రాన్ని సందర్శించి శ్రీ స్వామిని దర్శించి పూజించారు. సింహ ద్వారం వద్ద టెంకాయ కొట్టి సంబురాల్లో పాల్గొన్నారు.
అంతేగాక, యాదాద్రి పేరిట జిల్లా ఏర్పడటంతో హర్షం వ్యక్తం చేసిన మోత్కుపల్లి.. విజయోత్సవ సభ నిర్వహణకు సన్నద్ధమయ్యారు. యాదాద్రి క్షేత్రంలోనే అక్టోబర్ 2న విజయోత్సవ సభ నిర్వహిస్తానని చెప్పారు. ఆయన వెంట తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శోభారాణి, నాయకులు ముకుందర్‌రెడ్డి, పూర్ణచందర్‌రావు, బడిగె ఇస్తారి, రాజేష్, బాలయ్య, శ్రీను తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications