ప్రియుడు కొట్టాడు, గొడవ పడ్డాడు: మౌనిక ఉరేసుకుంది
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరంలో ఈ నెల 9వ తేదీన జిల్లా ఆస్పత్రిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మౌనిక కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పెళ్లి చేసుకుందామని ప్రియుడు వేధించడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు డిఎస్ఫీ దక్షిణామూర్తి శనివారంనాడు వెల్లడించారు.
చండ్రుగొండ మండలం దుబ్బతండాకు చెందిన భూక్యా మౌనిక (19) ఖమ్మంలోని మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతూ మామిళ్లగూడెంలోని స్వధార హోంలో ఉంటోంది. ఆమెకు ఏడాది క్రితం కూసుమంచి మండలం నాయకన్‌గూడేనికి చెందిన దేశబోయిన గణేష్ అలియాస్ చందు (22)తో పరిచయం ఏర్పడింది.
పెళ్లి చేసుకుందామంటూ గణేష్ కొంత కాలంగా మౌనికపై ఒత్తిడి పెడుతూ వస్తున్నాడు. రోడ్డు మీదనే ఆమెను చెంపపై కొట్టాడు. ఆదివారం మధ్యాహ్నం ప్రశాంత్ నగర్‌లోని గణేష్ గదికి మౌనిక వెళ్లింది. అక్కడ ఇరువురి మధ్య మరోసారి పెళ్లి విషయమై తీవ్రంగా ఘర్షణ జరిగింది. మౌనికపై గణేష్ చేయి కూడా చేసుకున్నాడు.

దాంతో తాను చనిపోతానంటూ మౌనిక తలను గోడకేసి కొట్టుకుంది. ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి వేసుకుంది. వెంటనే ఆమెను కిందికి దించి ఆటోలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ తన స్నేహితుడైన ఆటో డ్రైవర్ సాయంతో అతను స్ట్రెచర్ తెచ్చాడు.
అతనే గణేష్‌తో పాటు సిసిటీవి కెమెరాలో కనిపించిన యువకుడని, అతనికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. టూటౌన్ సిఐ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు.
నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు ప్రాంతంలో గణేష్ తండ్రి చేపలు పట్టడానికి వెళ్లగా, ఆస్పత్రి నుంచి గణేష్ నేరుగా అక్కడికే వెళ్లాడు. అతని సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా పోలీసులు గాలించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications