ఎమ్మెల్సీ కవితపై మళ్ళీ ఎంపీ అరవింద్ తీవ్రవ్యాఖ్యలు; నిజామాబాద్ లో పొలిటికల్ హీట్!!
నిజామాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అరవింద్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో ధర్మపురి అరవింద్ కవితను లిక్కర్ రాణి అంటూ వ్యాఖ్యలు చేశారు. కవిత మాదిరి కిషన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు లేవని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇక ఈ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత బిజెపి ఎంపీ అరవింద్ కు 24 గంటల పాటు సమయం ఇస్తున్నానని, ఆ లోగా ఆరోపణలను రుజువు చెయ్యకపోతే పులాంగు చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని అరవింద్ కు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. అర్థం పర్ధం లేని ఆరోపణలు చేస్తే బాగుండదని హెచ్చరించారు.

కవిత తాజా సవాల్ నేపథ్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మళ్ళీ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. తాను నిరాధార ఆరోపణలు చేస్తున్నానని నా ముక్కు నేలకు రాయాలని కవిత అంటుందని, నేను ముక్కు కాదు కాలు కూడా నేలకు రాయను అంటూ వ్యాఖ్యలు చేశారు. కవిత తండ్రి కేసీఆర్ ముక్కుని గజ్వేల్లో నేలకు రాయిస్తాను అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై నిర్వహించిన ధర్నాలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం కేసీఆర్ అన్నారు. పేదలకు నాలుగు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని భారీగా హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు.
తన మీద పోటీ చేసేందుకు కవిత భయపడుతుందని, అందుకే తన మీద వేరే వ్యక్తిని బరిలోకి దింపి గెలుస్తామని చెబుతోందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలు పాలయ్యారని, ఆయనను చూడడం కోసం కవితక్క కూడా పోతది అంటూ ఎద్దేవా చేశారు.
కవిత జైలుకు పోవాలని అందరూ దేవుడిని మొక్కాలని ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనకు తండ్రి వంటి వాడని పేర్కొన్న ఎంపీ అరవింద్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అంటూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications