ఏపీకిస్తే ప్రమాదం: మోడీకి గుత్తా, ఏంచేయలేం: పల్లా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ప్రత్యేక హోదా పైన లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణలోని పరిశ్రమలు ఆ రాష్ట్రానికి తరలిపోయే ప్రమాదముందని చెప్పారు.
రాజధాని మినహా అన్ని రంగాల్లోను తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తమంగా ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు తీవ్ర నష్టమని ఆయన మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ భూముల వ్యవహారం పైనా గుత్తా స్పందించారు. ఉద్యమం పుట్టిన విశ్వవిద్యాలయం భూమిని తీసుకోవడం సరికాదన్నారు.

ఏం చేయలేం: పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లిపై ఆగ్రహం
తెలంగాణ ఉద్యోగుల ఆవేదనను తాము అర్థం చేసుకున్నామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కమల్ నాథన్ కమిటీ వల్లే ఉద్యోగుల విభజన ఆలస్యమైందన్నారు. కమిటీలను కాదని ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పారు. సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి, ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు పైన పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిమంది ఎమ్మెల్యేలతో వెళ్లి ఎర్రబెల్లి బేరం ఆడలేదా అని ప్రశ్నించారు.
తెరాసపై ఎర్రబెల్లి నిప్పులు
అధికార తెరాస పార్టీ పైన ఎర్రబెల్లి దయాకర రావు నిప్పులు చెరిగారు. పసిపిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగల్లా, తెరాస తమ పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను అపహరించుకుపోతోందన్నారు. తెరాసను మగతనం లేని పార్టీగా ఆయన అభివర్ణించారు. నేతలు, ఎమ్మెల్యేలను సొంతగా తయారు చేసుకునే సత్తా తెరాసకు లేదన్నారు. తలసాని, ధర్మారెడ్డి, తీగల వంటి నేతలకు రాజీనామా చేసి గెలిచే సత్తా లేదన్నారు.
తెరాస నేతలు ఉస్మానియా, కాకతీయ వర్సిటీ స్థలాలను కబ్జా చేశారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఓయూ స్థలంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హోటల్ కట్టారని, వరంగల్‌లో దుగ్యాల శ్రీనివాస రావు వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారని ఆరోపించారు.
అలాగే కాకతీయ వర్సిటీ స్థలాన్ని ఓ ఎమ్మెల్యే కబ్జా చేశారన్నారు. కుమార్తెకు పదవి కోసమే కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతున్నారన్నరాు. తెరాస కేంద్రంలో చేరితే తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications