నోరు పారేసుకోకు, విశ్రాంతి తీసుకో: కేసీఆర్‌కు సవాల్ విసిరిన డీకే అరుణపై కవిత
హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ సవాల్ విసరడాన్ని టీఆర్ఎస్ ఎంపీ కవిత తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా డీకే అరుణపై ఎంపీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు.
శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ డీకే అరుణ బొమ్మాళి లాంటిదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నోరు పారేసుకుండా గద్వాల కోటలో విశ్రాంతి తీసుకోవాలని ఆమె సూచించారు. ఏ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలో ముఖ్యమంత్రికి బాగా తెలుసని ఆమె హితవు పలికారు.
రేపు సాయంత్రం వరకూ ఉంటా, చర్చకు రా?: కేసీఆర్‌కు డీకే అరుణ సవాల్
కాగా, గద్వాల్, జనగామను జిల్లాలుగా చేయాలని కోరుతూ శనివారం డీకే అరుణతో పాటు పొన్నాల లక్ష్మయ్య ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ తాను ఆదివారం సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

జిల్లాల విభజన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా సరే చర్చకు రావొచ్చని అన్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరుగుతుందని నిరూపించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే శనివారం ఉదయం బీజేపీ తిరంగా యాత్ర సందర్భంగా కేంద్రం మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమె మండిపడ్డారు.
కేబీఆర్ పార్క్ వద్ద తిరంగా యాత్రను ప్రారంభించిన వెంకయ్య నాయుడు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, చరిత్రను మరవకూడదని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఎంపీ కవిత స్పందిస్తూ వెంకయ్య హిందూ, ముస్లింలకు తగాదా పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినం కాదు.. మేం విలీన దినం చేస్తున్నామని ఎంపీ కవిత చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications