మునుగోడు బైపోల్: నార్సింగి వద్ద కారులో రూ. కోటి నగదు సీజ్, వారి పేర్ల వెల్లడి
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల వేళ పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు, అధికారులు. ఇప్పటికే కోట్లాది రూపాయలు తనిఖీల్లో పట్టుకున్నారు పోలీసులు. తాజాగా, శనివారం మణికొండ పరిధిలోని నార్సింగి వద్ద రూ. కోటి నగదును సీజ్ చేశారు.
ఈ ఘటనలో సంబంధం ఉందని భావిస్తున్న కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డిలు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరితోపాటు పరారీలో ఉన్న మరో వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మణికొండలోని ఓ విల్లా నుంచి కోటి రూపాయల నగదును మునుగోడులో ఉన్న సుమంత్ రెడ్డి, సూర్యపవన్ రెడ్డిలకు అందజేసేందుకు నలుగురు వ్యక్తులు కారులో బయలుదేరారు. నార్సింగి రోటరీ వద్దకు రాగానే పోలీసులు కనిపించడంతో వీరు కారు వేగాన్ని పెంచారు. దీంతో అనుమానించిన పోలీసులు.. వీరిని వెంబడించి కారును పట్టుకున్నారు.
ఆ తర్వాత కారును సోదా చేయగా.. అందులో రూ. కోటి నగదు బయటపడింది. కారుతోపాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా.. సుమంత్ రెడ్డి, సూర్యపవన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి పేర్లను చెప్పినట్లు తెలిసింది.