
మునుగోడు ఉపఎన్నిక: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెరపైకి కొత్త డిమాండ్లు!!
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాజకీయం ఇప్పటినుంచే రసవత్తరంగా మారుతుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు నియోజకవర్గంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీల తీరుతో నియోజకవర్గంలోనూ అదును చూసి ప్రజల నుండి అనేక డిమాండ్లు వెల్లువగా మారాయి.

మునుగోడు నియోజకవర్గ ప్రజల నుండి అనేక డిమాండ్లు
మునుగోడు నియోజకవర్గాన్ని టిఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేసుకోవాలని అభివృద్ధి చేయాలని భావిస్తున్న టిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మంత్రి జగదీష్ రెడ్డి ని రంగంలోకి దింపింది. మంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ కీలక నేతలతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు తెప్పించుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలను అవకాశంగా తీసుకొని పార్టీలకతీతంగా ప్రజల నుండి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి.

చుండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్
మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలంటే నియోజకవర్గంలో కొత్తగా తెరమీదికి వస్తున్న పలు డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా తెరమీదకు వచ్చిన డిమాండ్ ల విషయానికి వస్తే మునుగోడు నియోజకవర్గంలో చుండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేస్తున్నారు ఆ డివిజన్ లోని ప్రజలు. చుండూరు మున్సిపాలిటీ అయిన కారణంగా దానిని రెవిన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని డిమాండ్ వినిపిస్తుంది.

చుండూరు, మునుగోడు మండలాలు నల్గొండ డివిజన్ పరిధిలో
అలా మారితే నియోజకవర్గం మొత్తం ఒకే రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుందని, పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందని పార్టీలకతీతంగా పలువురు నేతలు సూచిస్తున్న పరిస్థితి ఉంది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ కలిపి చౌటుప్పల్ డివిజన్ కేంద్రంగా, అలాగే నాంపల్లి, మర్రిగూడ మండలాలు దేవరకొండ డివిజన్ పరిధిలో, చుండూరు, మునుగోడు మండలాలు నల్గొండ డివిజన్ పరిధిలో ఉన్నాయి. అయితే చుండూరు రెవెన్యూ డివిజన్ చేయాలని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.

మంత్రి జగదీశ్ రెడ్డిని కలవటానికి రెడీ అవుతున్న నేతలు
చుండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి రవికుమార్ కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ కు ఈ మేరకు లేఖ రాశారు. ఇక స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా తమ ప్రతిపాదనలు మంత్రి జగదీష్ రెడ్డి ముందు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. చుండూరు రెవెన్యూ డివిజన్ గా మారితే కోర్టు, 100 పడకల ఆసుపత్రి, ఫైర్ స్టేషన్ వంటి సౌకర్యాలు చుండూరులో స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని నేతలు చెబుతున్నారు.

మునుగోడులో అభివృద్ధి చెందని గ్రామాల నుండి డిమాండ్ల వెల్లువ
అంతేకాదు మునుగోడు నియోజకవర్గం లోని అభివృద్ధి చెందని అనేక గ్రామాలలో ప్రజల నుండి గ్రామ అభివృద్ధికి సంబంధించిన అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక రాజకీయం స్థానిక ప్రజలకు అధికార టీఆర్ఎస్ పై ఒత్తిడి తీసుకురావడానికి ఆయుధంగా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయాన్ని చూసిన ప్రజలు, ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందన్న నేపథ్యంలోనే అనేక డిమాండ్లను తెరమీదికి తెస్తున్నారు.