మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి?: రేపు కేసీఆర్ ప్రకటించే ఛాన్స్
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాషాయ పార్టీ తమ అభ్యర్థిగా ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికలో తమదే విజయం అంటూ కమలం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే టీఆర్ఎస్ అధిష్టానం
ఇక సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా మునుగోడులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. మునుగోడులో పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా వారికి మద్దతుగా నిలవాలని ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే, టీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రబాకర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

రేపటి సభలో కూసుకుంట్ల పేరును కేసీఆర్ ప్రకటించే ఛాన్స్
కాగా, ఇప్పటికే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మునుగోడులో శనివారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలోనే మునుగోడు అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ అసమ్మతి నేతలు
అయితే, టీఆర్ఎస్ పార్టీలో మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పటికే కొందరు టీఆర్ఎస్ నేతలు కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ పార్టీ మారారు. కూసుకుంట్లకు తప్ప వేరే నేతలను ప్రకటిస్తే మద్దతిస్తామని అసమ్మతి నేతలు స్పష్టం చేస్తున్నారు.

మునుగోడు టికెట్ కోసం టీఆర్ఎస్ ఆశావాహుల ప్రయత్నాలు
మరోవైపు, మునుగోడు టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పలువురు నేతలు రేపటి సభ ఏర్పాట్లలో భాగంగా కేసీఆర్ ఫొటోలతో పెద్ద బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితోపాటు కర్నె ప్రభాకర్, కంచర్ల కృష్ణారెడ్డి పెద్ద ఎత్తున కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications