జూపల్లి రామేశ్వరరావు కొంప ముంచిన సమతామూర్తి శిలాఫలకం??
మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి భారతీయ జనతాపార్టీ కోటాలో రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారనే వార్తలు ఇటు తెలంగాణలో, అటు ఢిల్లీలో వచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటీవలే నలుగురు సభ్యులు రాజ్యసభకు ఎంపికయ్యారు. తాను అవసరమైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటానని, తనను రాజ్యసభకు పంపించాలని జూపల్లి కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక సమీకరణాల దృష్యా జూపల్లి ఎంపిక జరగలేదు

ముఖ్యమంత్రి కేసీఆర్ తో పెరిగిన దూరం
తెలంగాణ నుంచి భారతీయ జనతాపార్టీ డాక్టర్ కె.లక్ష్మణ్ ను ఎంపిక చేసింది. BC వర్గానికి చెందిన లక్ష్మణ్ వల్ల రాజకీయంగా లాభపడతామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి BC ల తరఫున గాయత్రి రవిని ఎంపిక చేశారు. దీంతో బీజేపీ తన వ్యూహం మార్చి బీసీల నుంచి ఒక సామాన్యమైన నేతను రాజ్యసభకు పంపించామనే సంకేతాన్ని ప్రజలకు పంపించాలనుకుంది. దీంతో జూపల్లి రామేశ్వరరావుకు అవకాశం జారిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కొంప ముంచిన శిలాఫలకం
సమతామూర్తి కార్యక్రమం సందర్భంగా శిలాఫలకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు లేకపోవడంతో చినజీయరుస్వామికి, ఆయన శిష్యుడు జూపల్లికి కేసీఆర్‌తో దూరం పెరిగిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన ఏపీ నుంచి ప్రయత్నించారు. కేసీఆర్‌తో జగన్‌కు మంచి సంబంధాలుండటంతో మళ్లీ రామేశ్వరరావుకు అవకాశం కల్పించి కేసీఆర్‌తో కయ్యం తెచ్చుకోవడం ఎందుకున్న ఉద్దేశంతో తమ ముఖ్యమంత్రి ఆయన్ని ఎంపిక చేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు గతంలోనే వెల్లడించాయి.

భవిష్యత్తులో అవకాశం ఉంటుందా?
రాబోయే తెలంగాణ ఎన్నికలకు భారతీయ జనతాపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఊరూ వాడా తెలంగాణ రాష్ట్ర సమితిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తెలంగాణ నుంచి ఎన్నికల సమయంలో తమకు ఆర్థికంగా సహాయ సహకారాలందించే వ్యక్తి ఉంటే పని సులువవుతుందని బీజేపీ పెద్దలు భావించారు. అందుకనుగుణంగా జూపల్లి రామేశ్వరరావును ఎంచుకున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా బీజేపీ లక్ష్మణ్ వైపు మొగ్గుచూపింది. భవిష్యత్తులో అవకాశం ఉంటుందనే ఆశాభావంతో జూపల్లి ఉన్నారు.

4కేసీఆర్ వ్యూహం
రాజ్యసభకు తాను ఎవరిని ఎంపిక చేస్తే ప్రత్యర్థి పార్టీలు ఎవరిని ఎంపిక చేస్తాయి? రాజకీయంగా లాభం చూసుకుంటాయో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే అంచనా వేయగలిగారు. అందుకే బీసీ కోటా నుంచి గాయత్రి రవిని ఎంపిక చేసి జూపల్లికి చెక్ పెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications