నాగుల పంచమి.. పాముల పుట్టల్లో పాలు పోయొద్దు.. నిబంధనలు అతిక్రమిస్తే కేసులే... అటవీశాఖ హెచ్చరిక...
నాగుల పంచమి రోజున పాములకు పాలు పోయొద్దని అటవీశాఖ హెచ్చరించింది. పాములు పాలు తాగవని... కాబట్టి అనవసరంగా పుట్టల్లో పాలు పోసి వాటిని హింసించవద్దని సూచించింది. నాగుల పంచమి కావడంతో కొంతమంది పాములు పట్టేవారు ఆలయాల వద్ద కనిపిస్తారని.. వారికి ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని తెలిపింది. 10 రోజుల పాటు వాటికి ఆహారం,నీరు ఇవ్వకుండా వారు ఆ సర్పాలను హింసించి నాగుల పంచమి రోజు గుడికి తీసుకొస్తారని... అందుకే అవి పాలు తాగుతాయని అధికారులు తెలిపారు. కాబట్టి ఇలా సర్పాలను హింసించేవారిని ప్రోత్సహించవద్దని సూచించారు. శుక్రవారం(ఆగస్టు 12) నాగుల పంచమి సందర్భంగా అటవీశాఖ అధికారులు ఈ సూచన జారీ చేశారు.
నాగుల పంచమి రోజు పాములు పట్టేవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. డీఎఫ్‌వోలు,ఎఫ్ఆర్వోలు,స్నేక్ సొసైటీ సభ్యులు,ఎన్జీవోలతో కలిసి పాములు పట్టేవారిని గుర్తిస్తామన్నారు. పాములు పట్టేవారు కనిపిస్తే 8002455364 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.పాములు పాలు తాగుతాయనే ప్రచారం మూఢ నమ్మకమని, అలాంటి వాటిని నమ్మవద్దని అటవీశాఖ చాలా ఏళ్లుగా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పాములను ఆడించడం, పాలు పట్టడం వంటివి చేస్తే వన్యప్రాణి చట్టం ప్రకారం నేరంగా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. పుట్టలో పాలు పోసినా,పాములను ఆడించినా జైలుకు పంపిస్తామని గతంలో అటవీశాఖ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.

శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి నాడు నాగ దేవతను కొలిచి మొక్కడం ఆనవాయితీగా వస్తోంది.ఆ రోజు మహిళలు నాగ దేవత ఆలయానికి వెళ్లి పుట్టలో పాలు పోస్తారు. సర్పదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. పాలు, పండ్లు,నాగపడిగేలు, నువ్వులు, జొన్నపెలాలు, పంచామృతం,గోధుమతో చేసిన పాయసం,మొదలైన వాటిని నాగదేవతకు నైవేద్యంగా పెడతారు. విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్ - అనే మంత్రాన్ని స్మరిస్తూ పుట్ట దగ్గర ఒక ఆకుతో చేసిన దొప్పలో ఆవుపాలు పోస్తారు.నాగ విగ్రహాలకు మాత్రం శిరస్సుపై నుండి పోయాలి.నాగ పంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. అంతకంటే ముందు ఐదుగురు అతిథులను ఇంటికి ఆహ్వానించి, ప్రసాదం ఇచ్చి, విందు భోజనం పెడతారు. శక్తి లేనివారు కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టి, ఆ తర్వాతే వారు తింటారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి.అంతా అనుకూలంగా ఉంటుంది. నాగ పంచమి,సంతాన సంబంధమైన విషయాలలో శుభం కలుగుతుంది. కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు.
శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప జాతి ఆవిర్భవించింది కనుక సర్ప భయం లేకుండా ఉండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే 'గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది.












Click it and Unblock the Notifications