నాగసుశీల కేసు: అసలేం జరిగింది? ఆ పేర్లతో బెదిరించారా.. శ్రీనాగ్ డైరెక్టర్ సంచలనం
నటుడు నాగార్జున సోదరి నాగసుశీల, శ్రీనాగ్ మేనేజింగ్ పార్ట్‌నర్ చింతలపూడి శ్రీనివాస రావుల మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ఆలస్యంగా వెలుగు చూసింది.
హైదరాబాద్: నటుడు నాగార్జున సోదరి నాగసుశీల, శ్రీనాగ్ మేనేజింగ్ పార్ట్‌నర్ చింతలపూడి శ్రీనివాస రావుల మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ఆలస్యంగా వెలుగు చూసింది. చింతలపూడిపై నాగసుశీల ఫోర్జరీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు.
Recommended Video

చదవండి: మోసం చేశారు: 13మంది 'శ్రీనాగ్' డైరెక్టర్లపై నాగ సుశీల ఫిర్యాదు, నాగార్జున జోక్యం చేసుకున్నా!

అసలేం జరిగిందంటే
బంజారాహిల్స్‌లో ఉండే నాగసుశీల, శ్రీనగర్ కాలనీలో నివసిస్తున్న చింతలపూడి శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు. 2010 ఫిబ్రవరి 8న ఎస్సార్ ప్రాపర్టీస్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించారు. సంస్థ పేరుమీదే విశాఖపట్నం సమీపంలోని భోగాపురం, విజయనగరం ప్రాంతాల్లో రూ.12 కోట్ల విలువ చేసే భూములను కొనుగోలు చేశారు.

రంగారెడ్డి భూమిలో నాగసుశీల పెట్టుబడి, భార్య పేరిట శ్రీనివాస్
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలో ఆరు ఎకరాల భూమిని, మరోచోట 34 ఎకరాలు కొన్నారు. ఇందుకు అవసరమైన డబ్బును నాగసుశీల పెట్టుబడిగా పెట్టారు. ఇదే సమయంలో శ్రీనివాస్ తన పేరుమీద, తన భార్య సునీత పేరు మీద ఎస్సార్ ప్రమోటర్స్ అనే మరో సంస్థను ప్రారంభించారు.

ఆస్తులు అమ్మి తన సంస్థలకు బదలాయించారు
చినమంగళవారంలో కొనుగోలు చేసిన రూ.2.36 కోట్ల విలువ చేసే 12 ప్లాట్లను రూ.71,12,500లకు విక్రయించి, ఆ డబ్బును తన సంస్థ ఎస్సార్ ప్రమోటర్స్‌కు బదలాయించుకున్నారు.

విషయం తెలిసి నాగసుశీల ఫిర్యాదు
విషయం తెలుసుకున్న నాగ సుశీల 2017 అక్టోబర్ 13న శ్రీనివాస్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు చింతలపూడి శ్రీనివాస్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

స్పందించిన శ్రీనివాస రావు
నాగసుశీల, శ్రీనివాస రావులు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వారు సినిమా నిర్మాణంలో కూడా ఉన్నారు. నాగ సుశీల తనపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో శ్రీనివాస రావు ఆయన స్పందిస్తున్నారు. కంపెనీకి మేనేజింగ్ పార్ట్‌నర్ తాను అయినప్పుడు ఫోర్జరీ ఎక్కడిది అన్నారు. అయినా పది ప్లాట్ల కోసం నేను ఎందుకు ఫోర్జరీ చేస్తానన్నారు.

నాగసుశీలపై సంచలన వ్యాఖ్యలు
శ్రీనివాస రావు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ నాగసుశీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న సివిల్ వివాదాన్ని కుట్ర కేసుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన కంపెనీలోనే వారు భాగస్వామి అన్నారు.

అందుకే నాగ సుశీల ఇలా
కొన్నేళ్ల పాటు తన రియల్ ఎస్టేట్ బిజినెస్ పక్కన పెట్టి వాళ్ల అబ్బాయి సినిమాల కోసం పని చేశామని, నష్టాలు వస్తున్నాయని, దీంతో తాను నో చెప్పానని శ్రీనివాస రావు అన్నారు. తాను మధ్యవర్తిగా వారికి డబ్బులు ఇప్పించానని, అవి వారు తీర్చకుంటే గచ్చిబౌలిలోని తన ప్లాట్ అమ్మి ఇచ్చానని చెప్పారు. అప్పులు తీర్చే ఉద్దేశ్యం లేక ఇలా చేస్తున్నారన్నారు. గౌరవంతో నేను ఎక్కడా దీని గురించి చెప్పలేదన్నారు.

నాగార్జున, కేటీఆర్‌ల పేర్లు చెబుతూ బెదిరింపులా?
శ్రీనివాస రావు ఈ వివాదంలోకి నటుడు నాగార్జున, మంత్రి కేటీఆర్ పేర్లను కూడా లాగారు. అయితే శ్రీనివాస రావు స్వయంగా వారి పేర్లు చెప్పలేదు. నాగ సుశీల బయట ఇలా చెబుతున్నారని అంటూ ఇలా చెప్పారు. ఈ కేసులో తన తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యాడని, అంటే నాగార్జున ఏమైనా చేయగలరని, అవసరమైతే కేటీఆర్‌తో మాట్లాడి పోలీస్ బుక్ చేయిస్తామని, స్టేషన్లో పెట్టి ఆయన దగ్గర మిగిలిన ఆస్తులు రాయించుకుంటామని చెబుతున్నారని అన్నారు.

నాగార్జున బాధ్యత తీసుకోవాలి
నాగ సుశీల మాటలను బట్టి నాగార్జున ప్రభావితం చేసి ఉంటారా తెలియదని, నాగార్జున గారు ఏమైనా చేయగలరని ఆమె చెప్పారని, కాబట్టి తన విషయంలో తనకేమైనా అయితే ఆయన బాధ్యత తీసుకోవాలన్నారు. తనకు నాగార్జున లేదా నాగచైతన్యలపై ఎలాంటి ద్వేషం లేదన్నారు. నాగ సుశీలే తన సోదరుడి పేరు బయట చెబుతున్నారట అని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications