నాతో నలుగురొస్తే పెనుమార్పులుండేవి: టిఆర్ఎస్ ఆహ్వానంపై నాగం, కిషన్‌తో భేదాల్లేవు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలోనే ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తానని ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. నాగం జనార్దన్ రెడ్డి తన మనసులోని భావాలను ఓ తెలుగు మీడియా ఛానల్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం తెలంగాణను సాధించాలనే తపనతోనే ఆనాడు తెలుగుదేశం పార్టీ వదిలి బిజెపిలో చేరానని ఆయన స్పష్టం చేశారు.
బిజెపి సీనియర్ నేత, ప్రస్తుత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆహ్వానించడం వల్లే బిజెపి తీర్థం పుచ్చుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బిజెపితో తనకు ఎలాంటి సమస్యలు లేవని, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కూడా తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
అయితే, తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే సహించనని తెలిపారు. తెలంగాణ ఉన్నతి కోసమే 'తెలంగాణ బచావ్' సంస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. టిడిపిలోకి కానీ, టిఆర్ఎస్ లోకి కాని వెళ్లే ఆలోచన తనకు లేదని అన్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పాలన ప్రజల అభ్యున్నతికి అనుగుణంగా సాగడం లేదని మండిపడ్డారు. తాను టిడిపి వీడి వచ్చినప్పుడు తనతో పాటు కొంత మంది వచ్చారని.. మరో నలుగురు తన వెంట వచ్చి ఉన్నట్టయితే తెలంగాణలో పెను మార్పులు సంభవించి ఉండేవని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ తనను ఆహ్వానించినప్పటికీ, తాను ఆ పార్టీలోకి చేరలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదని అన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలోనైనా, ఇప్పుడు బిజెపిలోనైనా తన భూమిక ముఖ్యమైనదేని చెప్పారు. ‘బచావో తెలంగాణ' వెనక ఎలాంటి మిషన్ లేదని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఏర్పాటు చేశానని తెలిపారు. సొంత పార్టీ పెట్టే యోచనేమి లేదని స్పష్టం చేశారు.
రాజకీయంగా తాను ఎప్పుడూ తప్పటడుగులు వేయలేదని అన్నారు. తానేప్పుడు పైసలు, పదవుల కోసం లాలూచీ పడలేదని చెప్పారు. పార్టీలు ప్రజల్లో ఉంటేనే మనుగడ అని అన్నారు. ప్రజలకు మంచి పాలన అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కుల రాజకీయాలు నిలబడవని అన్నారు.
తాను 69లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నట్లు తెలిపారు. మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరి ముఖ్యమంత్రి అవుతారా? అని ప్రశ్నించగా.. తనకు అలాంటి ఆశేమి లేదని చెప్పారు నాగం. ఏదైనా ప్రజలు, పరిస్థితులు నిర్ణయిస్తానని నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications