కేసీఆర్ వ్యాఖ్యలు బాధించాయి, చావునోట్లో ఎవరు తలపెట్టారు?: జానా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉపఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బుధవారం నిర్వహించిన ప్రచార సభలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి జానా రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

చావునోట్లో ఎవరు తలపెట్టారు కేసీఆర్?
ఈ ఉపఎన్నిక అధికార టీఆర్ఎస్ అహంకారానికి, సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని జానారెడ్డి వ్యాఖ్యానించారు. అధికార పార్టీ తీరు తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానంటున్నారని.. కానీ, కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో చావు నోట్లో తలపెట్టి తెలంగాణ ఇచ్చిందన్న విషయం మర్చిపోవద్దన్నారు.

కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు మానుకో..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము పూర్తిగా సహకరించాం కాబట్టే.. తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని జానారెడ్డి హితవు పలికారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏడాడూ పదవుల కోసం పాకులాడలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు కోసం మంత్రులతో రాజీనామా చేయించింది జానా రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ జేఏసీ ఏర్పాటైంది తన ఇంట్లో కాదా? అని జానా రెడ్డి నిలదీశారు. సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

కుర్చీ వేసుకుని పనులు చేయిస్తానంటూ జానా రెడ్డి
పదవుల కోసమే కాదు.. ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా తాను ఏనాడూ ఎవరి చుట్టూ తిరిగింది లేదన్నారు. 30-40 ఏళ్లు శాంతి సామరస్యాలు, వెల్లివిరిసేలా తాను పనిచేశానని చెప్పారు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నారు. కేసీఆర్ మాత్రం హైదరాబాద్ లోనే కుర్చీ వేసుకుని కూర్చున్నారంటూ చురకలంటించారు జానా రెడ్డి.
హాలియాలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన విషంయ తెలిసిందే. నాగార్జున సాగర్ కు జానా రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు. ప్రజలు ఆగం కాకుండా ఆలోచించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే జానారెడ్డి గురువారం మీడియా సమావేశంలో కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications