ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..?
సమాజంలో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆడపిల్ల అయితే చాలు అని మృగాళ్లలా మీదపడిపోతున్నారు. ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా పాఠాలు చెప్పాల్సిన టీచర్ పాడు పనులు చేశాడు. నీతులు బోధించాల్సిన ఉపాధ్యాయుడు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్షరాలు చెప్పాల్సిన స్థానంలో ఉండి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. నకిరేకల్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు గత కొన్నాళ్లుగా అదే స్కూల్లో చదువుతున్న ఒక బాలికను తీవ్రంగా టార్చర్ చేస్తున్నాడంటూ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారికి లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.

అయితే బాలిక తల్లిదండ్రులు ఇదే విషయంపై టీచర్ శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. అయితే శ్రీనివాస్ వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు పెడతానంటూ గట్టిగా అరవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో స్థానికులు ఆ ఉపాధ్యాయుడిని చితకబాదినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మండల విద్యాశాఖ అధికారి విచారణ జరిపి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించారు. నివేదిక అందిన వెంటనే సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications