Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తలాపునే నాగార్జున సాగర్: ఇదేమి శాపం, ఏలినవారి పాపం!

నల్లగొండ జిల్లా తలాపునే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. జిల్లా నుంచే కుడి, ఎడమ కాలువలు పారుతాయి. కానీ నల్లగొండ జిల్లా ప్రజలు చేసుకున్న పాపమేమిటో గానీ పడుచు ప్రాయంలోనే వృద్ధులుగా మారిపోతున్నారు.

హైదరాబాద్: నల్లగొండ జిల్లా తలాపునే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. జిల్లా నుంచే కుడి, ఎడమ కాలువలు పారుతాయి. ఈ జిల్లా మీదుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు, అటుపై క్రుష్ణా జిల్లాలోని బెజవాడ నగర నడిబొడ్డుపై గల ప్రకాశం బ్యారేజీకి తరలి వెళతాయి. కానీ నల్లగొండ జిల్లా ప్రజలు చేసుకున్న పాపమేమిటో గానీ పడుచు ప్రాయంలోనే వృద్ధులుగా మారిపోతున్నారు.

అష్ట వంకరలు తిరుగుతూ కన్నవారే సాకాల్సిన దుస్థితిలో జీవిస్తున్నారు. దీనికి కారణం ఫ్లోరోసిస్ సమస్య వెంటాడటమే కారణం. ఫ్లోరైడ్‌ భూతం రేపటి పౌరుల జీవితాల్ని బలిపెడుతోంది. పైకి కనిపించేలా విరుచుకుపడే క్రూరత్వాన్ని, కంటికి కనిపించకుండా నిశ్శబ్దంగా కాటేసే కపటత్వం చాటుకుంటోంది. పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్న పిల్లల్లో లోలోన ఫ్లోరైడ్‌ విషప్రభావం శరీరాన్ని క్రమేణ క్షీణింపజేస్తోందన్న సంగతి జిల్లాలో 8 -16 ఏళ్ల లోపు పిల్లల్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది.

ఈ వయస్సులోనే కాళ్లూచేతులు గుంజుతున్నాయని ఇక్కడి పిల్లలు పేర్కొంటున్నారు. ఈ ఫ్లోరైడ్‌ నీటిని ఇలాగే మరికొంత కాలం తాగితే.. బాల్యంలో తప్పిన ఉపద్రవం యవ్వనంలో విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉన్నది. అప్పుడు కాళ్లూ చేతులూ వంకర్లు పోకపోవచ్చు. కానీ కండరాలు బలహీనమవుతాయి. ఎముకలు పెళుసు బారి పోతాయి. పట్టుమని రెండు కిలోమీటర్లు కూడా గట్టిగా నడవలేరు. ఇది మానవ వనరుల ఉత్పాతక సామర్థ్యంపై ఎనలేని దుష్ప్రభావాన్ని చూపుతున్నది.

959 పాఠశాలల్లో ట్యాంకులు నిర్మించినా సరఫరా కానీ తాగునీరు

959 పాఠశాలల్లో ట్యాంకులు నిర్మించినా సరఫరా కానీ తాగునీరు

జిల్లాలో దాదాపు 959 పాఠశాలల్లో నీటి ట్యాంకులను నిర్మించినా.. తాగునీరు మాత్రం సరఫరా కావడం లేదు. ఐదేళ్లలోపు చిన్నారులకు పౌష్ఠికాహారం సరఫరా చేసే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఈ హాని కారక బోరునీరే ఉపయోగిస్తుండడం గమనార్హం. వేళ్లూనుకున్న ఫ్లోరైడ్‌ భూతం దశాబ్దాలు గడిచినా సమసిపోలేదనీ, నిశ్శబ్దంగా జడలువిప్పుతూ బాల్యాన్ని కబళిస్తున్నదనడానికి ఇది ఒక ఉదాహరణ.

ఎక్కడి గొంగళి అక్కడే...

ఎక్కడి గొంగళి అక్కడే...

ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీటి కోసం గత దశాబ్దిలో రూ.1551 కోట్లు మంజూరుకాగా, రూ.1159 కోట్లు ఖర్చుచేసి పరిస్థితి యధారాజా తధారాజా అన్న పరిస్థితి నెలకొన్నది. జిల్లాలోని పలు గ్రామాల్లోని రక్షిత తాగునీటి ట్యాంకుపై ఎర్ర అక్షరాలతో ‘నిలువ నీరు ఉంచకండి- దోమలను పెంచకండి' అని రాయడం కనిపిస్తోంది. పలు గ్రామాల పరిధిలో నీళ్లట్యాంకులను నెలలో 25-27 రోజులూ ఖాళీగానే ఉంచుతున్నారు. ఎందుకంటే ఇక్కడికి నీళ్లను వారం, పదిరోజులకోసారిగానీ సరఫరా చేయడంలేదు.

మూణ్ణెల్లుగా నీరు సరఫరా చేయని నామాపురం ట్యాంక్

మూణ్ణెల్లుగా నీరు సరఫరా చేయని నామాపురం ట్యాంక్


450 కుటుంబాలు ఉన్న మర్రిగూడ మండలం నామాపురం గ్రామంలో సుమారు 10 వేల లీటర్ల నిల్వ సామర్థ్యమున్న ఈ ట్యాంకుకు కూడా మూణ్నెళ్లుగా నీటి సరఫరా లేక పోవడంతో నిరుపయోగంగా ఉన్నది. మర్రిగూడ మండలం శివన్నగూడ ప్రాథమిక పాఠశాలకు శుద్ధ తాగునీటి సరఫరా లేదు. బోరు నీరే ఆధారం. ఆ నీరేమో అణువణువూ విషతుల్యమే. దీంతో పిల్లలు తాగునీటి సీసాలు తెచ్చుకుంటున్నారు.

అది గరళమే...

అది గరళమే...

ఒకవేళ పొరపాటున తెచ్చుకున్న నీరైపోతే.. గత్యంతరం లేక తిరిగి ‘గరళాన్నే' తాగుతున్నారు. బడిలో మధ్యాహ్న భోజనం వండటానికీ బోరునీరే ఉపయోగిస్తున్నారు. ఇక్కడి నీటిలో 9 పీపీఎం ఫ్లోరైడ్‌ ఉంటున్నది. ఒక్కొక్కరిని పరీక్షించగా.. పదేళ్లలోపు వయస్సున్న వీరిలో దాదాపు 20 శాతం మందిలో ఇప్పటికే ‘దంత ఫ్లోరోసిస్‌' సోకినట్లు ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించారు. మరో 20 శాతం మందిలో ఇంకా బయట పడని తొలిదశలో ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు.

200 గ్రామాల్లో తాగునీటికి కటకట

200 గ్రామాల్లో తాగునీటికి కటకట

జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రతకు శివన్నగూడెం, రామాపురం, ఇందుర్తి, కొట్టాల, వాయిల్లపల్లి, సరంపేట, బట్లపల్లి, వట్టిపల్లి, చర్లగూడెం, వెలగపల్లి... తదితర సుమారు 200 గ్రామాల్లో తాగునీటికి ప్రజలు కటకటలాడుతున్నారు. 500 కుటుంబాలు ఉన్న ఒక గ్రామానికి రోజుకు కనీసం 25 వేల నుంచి 30 వేల లీటర్ల తాగునీరు అందించాలి. కనీసం వారానికి ఒకసారి కూడా అంత మోతాదులో తాగునీరు సరఫరా చేయడం లేదని గ్రామస్తులు చెప్తున్నారు.

కాస్తా స్తోమత ఉన్నవాళ్లు...

కాస్తా స్తోమత ఉన్నవాళ్లు...

కొందరు వారి ఆర్థిక స్థోమతను బట్టి కొన్నిసార్లు ‘అతి సూక్ష్మ వడబోత (రివర్స్‌ ఆస్మోసిస్‌ - ఆర్‌వో)' విధానంలో గ్రామాల్లో లభిస్తున్న నీరు కొనుగోలు చేసి తాగుతుండగా.. స్థోమత లేని వారు బోరు నీటినే తాగాల్సి వస్తోంది. ఆర్‌ఓ ప్లాంట్ల నిర్వహణపై పర్యవేక్షణ లేదని విమర్శలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మూత్రపిండాల వైఫల్యం, నాడీ సంబంధ సమస్యలూ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆ రెండు పథకాల పైనే ప్రజల ఆశలన్నీ

ఆ రెండు పథకాల పైనే ప్రజల ఆశలన్నీ

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ, కాకతీయ పథకాల ద్వారానైనా తమ బతుకులు బాగుపడతాయని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. చెరువులు, కుంటల వంటి స్థానిక చిన్న నీటి వనరులను బలోపేతం చేయడంతో ఉపరితల నీటిని ఎక్కువగా ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలి. తద్వారా భూగర్భ జలాల వినియోగం తగ్గి ఫ్లోరైడ్‌ నుంచి రక్షణ పొందే వెసులుబాటు లభిస్తుంది.

మిషన్ భగరీథ

మిషన్ భగరీథ

ప్రస్తుతం మిషన్‌ భగీరథ పైపులైన్ల నిర్మాణానికి తవ్వకం పనులు జిల్లాలో కొన్నిచోట్ల ప్రారంభం అయ్యాయి. గతేడాది ఆగస్టు 31 నాటికి భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని 421 ఆవాసాలకు నీళ్లివ్వాలని తొలుత ప్రణాళికలు రూపొందించినా.. అవి కార్యరూపం దాల్చలేదు. పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తయి ఇంటింటికీ కృష్ణాజలాలు అందుబాటులోకి రావడానికి మరో ఏడాది, ఏడాదిన్నర కాలం పట్టే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఈ లోగా ఇప్పటికే ఏర్పాటు చేసిన పైపులైన్ల ద్వారానైనా క్రమం తప్పకుండా తగు మోతాదులో తాగునీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నారు.

ఎదుగుదలపై దుష్ప్రభావం

ఎదుగుదలపై దుష్ప్రభావం

బాల బాలికలను ఫ్లోరైడ్ బూతం సోకడంతో వెన్నుపూస వంగిపోతున్నాయి. కండరాలు బలహీనమై.. అవయవాల అవకరం లేకుండా పోయాయి. దీంతో ఎముకలు పెళుసు బారిపోయాయి. కండరాల పటుత్వం పోయింది. 12, 15 ఏళ్ల వయస్సులో ఉన్న బాలికలు బాల్యంలోనే ఉన్నట్లు కనిపించడానికి వారందరికీ ఫ్లోరోసిస్ సోకడమే కారణమని చెప్తున్నారు. ఫ్లోరోసిస్‌కు పేదరికం కూడా తోడవడంతో వీరి ఎదుగుదలపై తీవ్ర దుష్ప్రభావం చూపింది. అందుకే వయసు కంటే వారంతా చాలా చిన్నగా కనిపిస్తున్నారు. ఖుదాబక్షిపల్లి వాసుల్లో కొందరు దంత ఫ్లోరోసిస్ సమస్యతో సతమతం అవుతున్నారని వైద్యులు తేల్చారు. కౌమార వయస్సులోనే కాళ్లూ చేతులు లాగుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.

ఉద్యోగ, వ్యాపార వర్గాలు ఇలా మెరుగు

ఉద్యోగ, వ్యాపార వర్గాలు ఇలా మెరుగు

ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారంతా చిన్నప్పుడు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధ పడుతున్న వారే తాము చిన్నప్పుడు ఇదే ఫ్లోరోసిస్ నీళ్లు తాగడంతో దంత ఫ్లోరోసిస్ వ్యాధితో బాధ పడ్డామని తెలిపారు. తాము సంపాదిస్తున్నందున పౌష్టికాహారం తీసుకుని నిలదొక్కుకుని జీవిస్తున్నామని అంటున్నారు. కానీ ఈ తరం చిన్నారులు కూడా ఫ్లోరైడ్ తాగిన నీటిని వాడటం బాధాకరమని ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నారు.

పూర్వ నల్లగొండ జిల్లాలో ఇది ఫ్లోరైడ్‌ తీవ్రత

పూర్వ నల్లగొండ జిల్లాలో ఇది ఫ్లోరైడ్‌ తీవ్రత

నల్లగొండ జిల్లాలోని గ్రానైట్‌ రాళ్లలో సగటున కిలోకు 1440 మిల్లీ గ్రాముల ఫ్లోరైడ్‌ ఉన్నదని తేలింది. ప్రపంచంలో దీని సగటు కేవలం కిలోకు 810 మిల్లీగ్రాములే. పాత నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలు 1175 ఉన్నాయి. ఈ గ్రామాలకు నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం ప్రాజెక్టుల ద్వారా గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తం ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు మొత్తం కృష్ణా జలాలను అందించాలంటే 1.50 టీఎంసీల నీళ్లు కావాలి. ప్రస్తుతం 0.2 టీఎంసీల నీరు మాత్రమే బాధిత గ్రామాలకు సరఫరా అవుతోంది.

రెండు రోజుల నుంచి వారానికోసారి తాగునీటి సరఫరా

రెండు రోజుల నుంచి వారానికోసారి తాగునీటి సరఫరా

ప్రస్తుతం 30 శాతం గ్రామాల్లో అంటే దాదాపు 400 గ్రామాలకు రక్షిత కృష్ణా జలాలు రెండు రోజులకొకసారి, మరో 200 గ్రామాలకు మూడు రోజులకొకసారి నీటిని సరఫరా చేస్తుండగా మిగిలిన 500 గ్రామాలకు వారంలో ఒకరోజు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టుల నుంచి గ్రామాలకు వెళ్లే నీటిని అక్కడి ఫిల్టర్‌ బెడ్‌ల ద్వారా శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేసిన నీటినే పైపులైన్ల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. పుట్టిన తర్వాత మొదటి ఐదేళ్లు ఏ నీళ్లైతే తాగుతారో.. అందులో ఫ్లోరైడ్‌ ఎంతుంటుందో ఆ ప్రభావం దంతాలు, ఎముకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. పళ్లు గారపట్టినట్లు దెబ్బతింటాయి. ఎముకలు, కండరాలు, మూత్ర పిండాల, నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. అందుకే బాల్యం నుంచే శుద్ధనీరు తాగేలా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.

ఒక్కో గ్రామానికి ఒక్క బోరే ఆధారం

ఒక్కో గ్రామానికి ఒక్క బోరే ఆధారం

ఇక్కడి మొండిగోడలు.. కూలిన గోడల మధ్యన మొలిచిన ముళ్లచెట్లు.. శిథిలావస్థలో ఉన్న పాఠశాల.. ఇవన్నీ గతం తాలుకూ ఆనవాళ్లను చెబుతున్నాయి. పదేళ్ల కిందట దాదాపు 50 కుటుంబాలు ఉండే పల్లెలకు బోరొక్కటే ఆధారం. దశాబ్దాలుగా ఈ నీళ్లే తాగి.. ఇక్కడి కుటుంబాల్లో కాళ్లు వంకర్లు పోవడం, నడుము వంగిపోవడం.. మానసిక దౌర్భల్యం.. చివరకు అర్థాంతరంగా తనువు చాలించడం.. ఇలాంటి ఘటనలు ఎక్కువ కావడంతో సొంత ఊళ్లను ఖాళీ చేసి పొరుగున మరో ఊరికి ఇక్కడి కుటుంబాలు వలసవెళ్లాయి.

ఫ్లోరోసిస్ సమస్యను ప్రధానాంశం చేయాలని అభ్యర్థనలు

ఫ్లోరోసిస్ సమస్యను ప్రధానాంశం చేయాలని అభ్యర్థనలు

తమను ప్రచార వస్తువుగా, ఓటు బ్యాంకుగా చూడవద్దని ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్ తెలిపారు. ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాలను ప్రాధాన్యాంశంగా గుర్తించాలని, తాగునీటితోపాటు సాగునీరుకూ కృష్ణా జలాలను సరఫరా చేస్తే భూగర్భజలాల వినియోగం తగ్గి ఫ్లోరైడ్‌ నుంచి రక్షణ లభిస్తుందని చెప్పారు. నల్లగొండ జిల్లాలోనే తాగు, సాగునీటి కోసం వేల మంది అరెస్టయిన చారిత్రక ఘటనలు జరిగాయని జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణ తెలిపారు. నాయకులు, యంత్రాంగంలో స్పందన తాత్కాలికమేనని, ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. తత్ఫలితంగా ఈ తరం కూడా బలై పోతున్నా చక్కదిద్దాల్సిన యంత్రాంగం నిద్రావస్థలో ఉన్నదని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+