షాకింగ్: తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య -పార్టీలే సూసైడ్ చేసుకోవాలంటూ
ఎప్పుడో ఏడేళ్ల కిందట.. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం ఓ నిరసన రూపంగా కొనసాగింది. ఆ తీవ్ర చర్యలు మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. నాడు రాష్ట్రం కోసం వందల మంది యువకులు తమ ప్రాణాలను బలిపెట్టగా, ఇప్పుడు అభిమాన నేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఓటమిని జీర్ణించుకోలేక ఓ యువకుడు బలిదానానికి పాల్పడ్డాడు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వేళ సంచలనంగా మారిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
వామ్మో అంజలి.. 18 పెళ్లిళ్లతో తెలుగు యువతి సంచలనం -శోభనం కాగానే నగలు, డబ్బుతో పరార్

లంకపల్లిలో యువకుడి ఆత్మహత్య
నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం, లంకలపల్లిలో శ్రీశైలం అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి తీన్మార్ మల్లన్న తరఫున ప్రచారం నిర్వహించి, కీలక అనుచరుడిగా వ్యవహరించిన శ్రీశైలం.. ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న అతన్ని కుటుంబీకులు నల్గొండలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

మల్లన్న ఓటమిని తట్టుకోలేక..
మర్రిగూడ మండలం, లంకపల్లికి చెందిన శ్రీశైలం విద్యాధికుడని, తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నాడని, రాష్ట్రంలో యువతకు జరుగుతోన్న అన్యాయాలపై, కేసీఆర్ సర్కారు తీరుపై గళం వినిపిస్తోన్న తీన్మార్ మల్లన్నకు శ్రీశైలం అభిమాని అని, తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై స్వల్ప ఓట్ల తేడాతో తీన్మార్ మల్లన్న ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకే శ్రీశైలం ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు చెబుతున్నారు. ఈ ఘటనపై..

అవును శ్రీశైలం మావాడే..
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వల్ప మెజార్టీతో విజయం సాదించారు. శనివారం రాత్రి జరిగిన తుది లెక్కింపులో పల్లా గెలుపు ఖరారైంది. ఓవరాల్ గా పల్లాకు 1,61,811 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 1,49,005 ఓట్లు వచ్చాయి. కేవలం 12, 806 ఓట్ల తేడాతో మల్లన్న ఓటమిపాలయ్యారు. చివరిదాకా గట్టిపోటీ ఇచ్చిన మల్లన్న పరాజయాన్ని ఆయన అభిమాని శ్రీశైలం జీర్ణించుకోలేకపోయాడు. ఆత్మహత్య ఘటనపై తీర్మాన్ మల్లన్న స్పందించారు. శ్రీశైలం తమవాడేనని అన్నారు.

తెలంగాణలో మార్పు కోసం..
మృతుడు శ్రీశైలాన్ని తమ్ముడుగా అభివర్ణించిన మల్లన్న.. తనతోపాటు శ్రీశైలం కూడా పాదయాత్రలో పాల్గొన్నాడని, తన టీమ్‌లో ఒక సభ్యుడుగా పనిచేశాడని తెలిపారు. ఎట్టి పరిస్థితిలో రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని తిరిగిన సోదరుడు దూరం కావడం చాలా బాధగా ఉందన్నారు. గెలుపోటములు సహజమని, ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని మల్లన్న విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు..

పార్టీలే ఆత్మహత్య చేసుకోవాలి..
నల్గొండ జిల్లా లంకపల్లికి చెందిన శ్రీశైలం ఆత్మహత్య నేపథ్యంలో తీన్మార్ మల్లన్న తన అభిమానులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. ‘‘సోదరులారా రాబోయేది మన రాజ్యమే.. ఎవరూ ఆధైర్యపడకండి.. సూసైడ్ చేసుకోవాల్సింది మనంకాదు.. ప్రజలకు దూరంగా ఉన్న రాజకీయపార్టీలు సూసైడ్ చేసుకోవాలి.. నా మీద అభిమానం ఉన్న సోదరులు ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని'' అని మల్లన్న పేర్కొన్నారు. శ్రీశైలం కుటుంబానికి అండగా ఉంటామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.