మోడీ పిలిస్తే కేసీఆర్ రెడీ, కవిత ఎంపికకు దోస్తీయేనా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరనున్నారు. చెరువులు, రహ దారులు, తాగునీటి సరఫరా వ్యవస్థ, ఆరోగ్య వసతులు, కొత్త విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద మొత్తం రూ.56,645.84 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు.
ఈ మొత్తాన్ని 2014-15 నుంచి 2018-19 మధ్య ఐదేళ్లలో విడుదల చేయాలని కోరుతారు. కేసీఆర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. ప్రధాని సమయాన్ని ఇప్పించాలని ఇప్పటికే సీఎంవో అధికారులు పీఎంవో అధికారులను కోరారు. ప్రధాని సమయం లభించిన వెంటనే కేసీఆర్ ఢిల్లీ వెళ్తారు.

తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో ఆరు జిల్లాలను వెనకబడిన జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటు సమయంలో పార్లమెంటుకు అప్పటి ప్రధాననమంత్రి మన్మోహన్ హామీ ఇచ్చినట్టుగా ఆ ఆరు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ప్రస్తుత ప్రధాని మోడీని కేసీఆర్ కోరనున్నారు.
మోడీ సర్కారుతో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతున్నాయని, దానికి సంకేతంగానే స్వచ్ఛభారత్ అంబాసిడర్‌గా సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితను కేంద్రం నియమించిందని ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని ప్రకటించవచ్చునంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోయే ప్రత్యేక ప్యాకేజీ నిధుల వ్యయాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక స్టీరింగ్ కమిటీని నియమిస్తామని ప్రధానికి సీఎం హామీ ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications