నవీన్ హత్య కేసులో నిహారికకు బెయిల్: చర్లపల్లి జైలు నుంచి విడుదల
అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో జరిగిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ ప్రేమించిన యువతి నిహారిక జైలు నుంచి విడుదలైంది.
హైదరాబాద్: నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో జరిగిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ ప్రేమించిన యువతి నిహారికకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఏ3గా ఉన్న ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చర్లపల్లి జైలు నుంచి విడుదలైంది.
నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు సహకరించినందుకు అతడి స్నేహితుడు హసన్, ప్రేమికురాలు నిహారికను పోలీసులు నిందితులుగా చేర్చి ఫిబ్రవరి 6వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హత్య గురించి తనకు హరిహరకృష్ణ చెప్పినా పోలీసులు సహా ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడం.. హత్యానంతరం ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, సందేశాలను తొలగించి సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేసినందుకు నిహారికను కూడా నిందితురాలిగా చేర్చి అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత నిందితులు హసన్, నిహారికలను హయత్ నగర్ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కాగా, ఇటీవల నిహారిక బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో శనివారం ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి ఆదివారం విడుదలైంది. ప్రస్తుతం నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణ, హసన్ జైలులోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications