'ఓటుకు నోటు మూసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు, జైలుకెళ్లడం ఖాయం'
Recommended Video

హైదరాబాద్/గజ్వెల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తున్నారు. ఆదివారం వేర్వేరు చోట్ల ప్రచారం నిర్వహించిన హరీష్ రావు, కేటీఆర్, నాయిని నర్సింహా రెడ్డిలు ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని నాయిని అన్నారు. తెలంగాణలో హోంమంత్రి పదవి కావాలని, ఆ పదవిని తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఓటుకు నోటు కేసును మూసివేయాలనేది టీడీపీ అధినేత ఉద్దేశ్యమని చెప్పారు.

రేవంత్ జైలుకెళ్లి వచ్చారు, చంద్రబాబూ వెళ్తారు
ఓటుకు నోటు కేసులో తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారని నాయిని గుర్తు చేశారు. రేవంత్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమనిచెప్పారు. చంద్రబాబు కూడా జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణలో ఆధిపత్యం చలాయించాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు.

ముసలి నక్క కాంగ్రెస్, గుంటనక్క చంద్రబాబు
చంద్రబాబు ఉస్కో కాంగ్రెస్ పార్టీ డిస్కో అంటోందని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, టీడీపీలతో కూడిన కూటమి మహా కూటమి కాదని, మాయాకూటమి అన్నారు. ఆ కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయినట్లే అన్నారు. తెలంగాణ రిమోట్ తన చేతుల్లోకి తీసుకొని ప్రాజెక్టులు ఆపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ముసలి నక్క కాంగ్రెస్, గుంట నక్క చంద్రబాబు ఒక్కటై తెలంగాణను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారి కుట్రలను ప్రజలు గుర్తించాలన్నారు.
అడిగితే అవసరం లేదన్నారు, ఏవైపో తేల్చుకో: కేసీఆర్‌పై బాబు, హైదరాబాద్‌తో మరో సిటీని పోల్చలేం

తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టుపెట్టారు
ఆరడుగుల ఆజానుబాహుడు జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నోట్ల కట్టల కోసం కక్కుర్తిపడి చంద్రబాబు ముందు సాగిలపడుతున్నారన్నారు. తెలుగు ప్రజలపై ఢిల్లీ పెత్తనం చెల్లదని, తెలుగవారి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే ఇప్పుడు చంద్రబాబు అదే పార్టీతో పొత్తు పెట్టుకొని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబుతో కాంగ్రెస్ చెట్టాపట్టాల్ వేయడం దారుణం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కథకు చంద్రబాబు స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నారు.

తెరాసను ఎదుర్కొనే ధైర్యం లేక
టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక అందరూ ఒక్కటయ్యారని మరో మంత్రి హరీష్ రావు అన్నారు. వందమంది కౌరవులు వచ్చినా పాండవులదే విజయమని చెప్పారు. ఏపీలో అడుగడుగునా మోసాలకు పాల్పడిన చంద్రబాబును అక్కడి ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధమవడం వల్లే కాంగ్రెస్ ముసుగులో తెలంగాణకు వస్తున్నాడని చెప్పారు. నాడు సోనియాను ఇటలీ దెయ్యం అని చెప్పి, ఈరోజు దేవత అని ఎలా అంటారని ప్రశ్నించారు.