పరిటాల ఎఫెక్ట్: బతికుండగా తన జీవితంపై సినిమా, డైరెక్టర్‌ని కలిసిన నయీం!
హైదరాబాద్: దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమా తీశాడు. పరిటాల జీవితంపై సినిమా తీయడం గ్యాంగ్ స్టర్ నయీంను కూడా ఆకర్షించినట్లుగా తెలుస్తోంది.
అదేవిధంగా తాను బతికి ఉండగానే తన పైన సినిమా తీయాలని ఆయన భావించాడని తెలుస్తోంది. పరిటాల రవి హత్య అనంతరం రక్త చరిత్రను తీశారు. నయీం ఆకృత్యాల గురించి దర్యాఫ్తు బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
నయీం ఓ తెలుగు డైరెక్టర్‌ను కలిశాడని, తన జీవితం పైన ఓ చిత్రాన్ని తీయాలని అడిగాడని తెలుస్తోంది. తాను నక్సలైటుగా ఎలా మారాను, ఆ తర్వాత తన జీవితం ఎలా ఉందనే విషయమై సినిమా తీయాలని సూచించాడని తెలుస్తోంది. అయితే, తన జీవితంలోని చీకటి కోణాన్ని మాత్రం సృషించవద్దని చెప్పాడని తెలుస్తోంది.

రాజకీయాల్లోకి వెళ్దామనుకున్నప్పుడే..
నయీం 2019 నాటికి రాజకీయాల్లోకి రావాలని, భువనగిరి నుంచి పోటీ చేసి గెలవాలని భావించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి రావాలని భావించిన నేపథ్యంలో సినిమా ద్వారా తనను తాను ప్రమోట్ చేసుకోవాలని భావించాడని తెలుస్తోంది.
సదరు డైరెక్టర్‌ను కలిసిన నయీం.. తాను కథను అందిస్తానని, అలాగే నిర్మాతను కూడా తానే చూస్తానని ఆయనకు చెప్పాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో నటించేందుకు నయీంకు ఆసక్తి లేదని, తన పాత్ర పోషించే వారిని వెతకాలని కూడా డైరెక్టరుకు సూచించాడని తెలుస్తోంది. నయీం అతనిని మరోసారి కలిశాడని, కానీ సదరు డైరెక్టర్ మాత్రం ఆసక్తిగా లేడని తెలిసింది. తన జీవితం ఆధారంగా సినిమా వస్తే డాన్‌లా ఉండాలని నయీం భావించాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications