'చంద్రబాబు పేరు చెప్పొద్దని రేవంత్‌పై టీడీపీ ఒత్తిడి!'
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అంశంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. రేవంత్ ఇష్యూలో చంద్రబాబుపై ఆధారాలున్నాయని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ టీడీపీ నేతలు భగ్గుమన్నారు.
అంతేకాదు, నాయిని మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. తాను నిర్దోషిగా బయటపడతానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అదే సమయంలో పరిస్థితి అటు ఇటు అయితే, టీడీపీకి మకిలి అంటించకుండా ఉండేందుకు ఆ పార్టీకి దూరంగా ఉండేందుకు కూడా సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.
దీనిపై నాయిని స్పందిస్తూ.. రేవంత్ కేసులో చంద్రబాబు కూడా ముద్దాయిని చేయాలని ప్రజల నుండి డిమాండ్ వస్తోందని చెప్పారు. దాంతో పాటు, జైలులో రేవంత్ రెడ్డిని కలుస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబు పేరు చెప్పవద్దని ఒత్తిటి చేస్తున్నట్లుగా తెలిస్తోందన్నారు.
ముడుపులు అందజేసిన ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉందని తమకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అవసరమైనపుడు వాటిని తాము బయటపెడతామనినాయిని చెప్పారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ ఎమ్మెల్యేలను కొనేందుకు ముడుపులు అందజేస్తూ దొరికిపోయారన్నారు.

రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరుతో రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని అన్నారు. ఇదిలావుండగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉండి తాము పోటీ చేసిన ఐదుకు ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్నామన్నారు.
వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిననందున త్వరలోనే వరంగల్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు రానున్నాయని, ఆ ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి మకిలి అంటించకుండా ఉండేందుకు ఆ పార్టీకి దూరంగా ఉండేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో పార్టీకి తన వల్ల నష్టం జరిగిందా అని జైలులో ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications