నా పైనే కేసులు ఉన్నాయి: తెలంగాణ హోంమంత్రి నాయిని (పిక్చర్స్)
హైదరాబాద్: తనపైనే రైల్వే పోలీసుల కేసులు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి శనివారం అన్నారు. తనతో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, పద్మారావు తదితరుల పైనా కేసులు ఉన్నాయని విలేకరుల సమావేశంలో చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయంలో భాగంగా శనివారం ఐదుగురి కుటుంబాలకు హోం మంత్రి రూ.10 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా గత ప్రభుత్వం పెట్టిన కేసులను చాలా వరకు రద్దు చేశామన్నారు. సుమారు వెయ్యి మందిపై కేసులు రద్దు చేశామన్నారు. అయితే రైల్వే పోలీసులు పెట్టిన కేసులు ఉన్నాయని, తనపైనా రైల్వే పోలీసులు ఐదు కేసులు నమోదు చేయగా, వాటిలో మూడింటిని కోర్టు కొట్టి వేసిందన్నారు.
రెండు కేసుల విషయంలో కోర్టుకు హాజరవుతున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులైన వారి కుటుంబాలను తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు.

నాయిని నర్సింహా రెడ్డి
అర్హులైన వారికి ఉద్యోగం, ఇల్లు కూడా ఇస్తున్నామన్నారు. ఆ కుటుంబాలకు 10 లక్షలు కాదు కదా 10 కోట్లు ఇచ్చినా వారి పిల్లలను మాత్రం తెచ్చి ఇవ్వలేమన్నారు. 1969 సంవత్సరంలో మరణించిన వారి కుటుంబాలనూ ఆదుకుంటామన్నారు.

నాయిని నర్సింహా రెడ్డి
హైదరాబాద్ జిల్లాలో అమరవీరుల కుటుంబాల నుంచి 23 దరఖాస్తులు అందాయని, వీటిలో ఇది వరకే 8 మంది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశామన్నారు.

నాయిని నర్సింహా రెడ్డి
1969 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అసువులు బాసిన నలుగురు అమరవీరులు కె వెంకటేశ్వర రావు, ఎన్ నాగభూషణం, ఎస్ నర్సింగ్ రావు, పి విజయ్ కుటుంబాలకు, 2001 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అసువులు బాసిన చెట్టి కనకయ్య కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున చెక్కులు ఇచ్చారు.

నాయిని నర్సింహా రెడ్డి
ఇంకా ఎవరైనా అమర వీరులు ఉంటే వారూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి రైల్వే కేసుల పరిష్కారానికి కేంద్రానికి లేఖ రాసినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ నెల 30న విపక్షాలు బంద్ ఇవ్వడం గురించి ప్రశ్నించగా, ప్రజాస్వామ్యంలో వారికి స్వేచ్ఛ ఉందన్నారు.

నాయిని నర్సింహా రెడ్డి
1969 అమరవీరులతోపాటు, 2001 ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున చెక్కులను హోంమంత్రి శనివారం సచివాలయంలో అందచేశారు. జిల్లాలవారీగా అమరవీరులను గుర్తించి జిల్లా మంత్రులు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఉద్యమకారులపై నమోదైన వెయ్యి కేసులను ఎత్తివేసామని.. ఏవైనా పెండింగ్ కేసులు ఉంటే వాటిని కూడా ఎత్తివేసే ప్రయత్నం చేసామని చెప్పారు.












Click it and Unblock the Notifications