దేశంలో హైదరాబాద్ బిర్యానీనే టాప్: ఎన్ని లక్షల ఆర్డర్లంటే?
హైదరాబాద్: మనదేశంలో బిర్యానీకి ఉన్న క్రేజేవేరు. ఇంకా హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడనివారెవరూ ఉండరు. సాధారణ రోజుల్లోనే బిర్యానీలు లాగించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పండగలు, సెలవు దినాల్లో మరింత అత్యధికంగా బిర్యానీలు తినేస్తున్నారు. తాజాగా స్విగ్గీ ఆర్డర్లలో హైదరాబాద్ బిర్యానీనే టాప్ లో ఉండటం గమనార్హం. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ నెలలోనూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం విశేషం.
దేశ వ్యాప్తంగా ఒక్క నెలలోనే 60 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. సాధారణ నెలలతో పోలిస్తే ఈ సంఖ్య 15 శాతం అధికమని తెలిపింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 8 వరకు వచ్చిన ఆర్డర్ల ఆధారంగా రూపొందించిన జాబితాను తాజాగా స్విగ్గీ విడుదల చేసింది.

ఇక దేశవ్యాప్తంగా బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్‌లో ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది. నెల రోజుల్లోనే 10 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. బిర్యానీతోపాటు హలీమ్ ఆర్డర్లలోనూ నగరవాసులు రికార్డు సృష్టించినట్లు తెలిపింది. ఈ నెలలో ఏకంగా 5.3 లక్షల హలీమ్ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని వివరించింది.
ఆర్డర్లలో ఎక్కువగా చికెన్, మటన్ బిర్యానీ, హలీమ్, సమోసా, ఫలుదా, ఖీర్ ఉన్నాయని స్విగ్గీ వెల్లడించింది. మొత్తంగా హలీమ్ ఆర్డర్లు 1454.88 శాతం, ఫిర్ని 80.97 శాతం పెరిగినట్లు తెలిపింది. మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్ 48.40 శాతం ఆర్డర్లు పెరిగినట్లు తెలిపింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, భోపాల్, మీరట్‌లో ఇఫ్తార్ స్వీట్ డిష్‌ల ఆర్డర్‌లు గణనీయంగా పెరిగినట్లు స్విగ్గీ తెలిపింది.












Click it and Unblock the Notifications