NEET: ఆసిఫాబాద్ పరీక్ష కేంద్రంలో తారుమారైన నీట్ ప్రశ్నాపత్రం
ఆసిఫాబాద్: దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో పలు చోట్ల తప్పిదాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఎన్టీఏ నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం తారుమారైంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ కాకుండా ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో పరీక్షకు హాజరైన విద్యార్థులకు మరో ప్రశ్నపత్రం అందించడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు.
ఆదివారం దేశవ్యాప్తంగా ఎన్టీఏ నీట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో 323 మందికి గానూ 299మంది పరీక్ష రాశారు. అయితే వారికి రావాల్సిన పేపరుకు బదులుగా ఎన్టీఏ తయారు చేసిన వేరే కోడ్ ఉన్న మరొక ప్రశ్నాపత్రాన్ని నిర్వాహకులు అందించారు. సోమవారం కీ పేపర్ పరిశీలించిన విద్యార్థులు తమకు ఇచ్చిన ప్రశ్నపత్రానికి ఎన్టీఏ విడుదల చేసిన కీ పేపర్లో లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ విషయంపై ఆర్డీవో లోకేశ్వరరావు పరీక్ష కేంద్రానికి వెళ్లి విచారణ చేశారు. దీనిపై పరీక్ష నిర్వాహకులను వివరణ కోరగా.. ఎస్బీఐ బ్యాంకు నుంచి తీసుకురావలసిన పేపర్‌కు బదులు కెనరా బ్యాంకు నుంచి తెచ్చిన పేపర్‌ను విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. అయితే ఎన్టీఏ ఈమెయిల్ ఆధారంగానే పరీక్ష పత్రం తీసుకువచ్చినట్లు చెప్పారు.
ఈ సందర్బంగా ఆర్డీవో మాట్లాడుతూ.. విద్యార్థులు రాసిన ప్రశ్నపత్రాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని ఎన్టీఏ అధికారులు వివరించినట్లు తెలిపారు. కాగా, ప్రశ్నపత్రం తారుమారుపై అధికారిక వెబ్సైట్లో ఉంచాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయంటూ వస్తున్న వార్తలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఖండించింది. ఆదివారం దేశ వ్యాప్తంగా 4750 కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్ పరీక్ష నిర్వహించినట్టు స్పష్టం చేసింది. నీట్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్ ప్రకారమే నిర్వహించినట్లు తెలిపింది.
పేపర్ లీకేజీ జరిగినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ప్రశ్నపత్రాలకు, ఆదివారం జరిగిన నీట్ పరీక్షా పత్రాలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.












Click it and Unblock the Notifications