Aswini Dutt: ఏపీకి రూ.25 లక్షలు.. తెలంగాణకు గుండు సున్నా.. అశ్వినీదత్ పై నెటిజన్స్ ఆగ్రహం..!
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఈ వర్షాలతో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరం వరదలతో తల్లడిల్లింది. చాలా కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇటు ఖమ్మం నగరం కూడా భారీ వర్షాలతో జల దిగ్బంధంలో చిక్కుకుంది. జల విలయంతో చాలా మంది ఆగమయ్యారు. బాధితులకు సాయం చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు విజయవాడలో పర్యటించారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అండగా ఉంటామని బాధితులకు హామీ ఇస్తున్నారు. భారీ వర్షాలతో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకోవడానికి టాలీవుడ్ ముందుకొచ్చింది. సినీ ప్రముఖులు పెద్ద మనస్సుతో సాయం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. హీరో విశ్వక్ సేన్ రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షలు సీఎం సహాయ నిధికి అందించారు.

వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ కూడా వరద బాధితులకు విరాళం ప్రకటించారు. ఏపీకి రూ.25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే తెలంగాణలో కూడా భారీ వర్షాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కానీ వైజయంతి మూవీస్ కేవలం ఏపీకి మాత్రమే సహాయాన్ని ప్రకటించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు. సినీ పరిశ్రమకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లు చెప్పుకునే వారు ఇలా తెలంగాణకు అన్యాయం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అశ్వినీదత్ హైదరాబాద్ లో ఉంటూ.. తెలంగాణకు ప్రజలకు సహాయం ప్రకటించకపోవడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాల మధ్య తేడా చూపిస్తే.. మళ్లీ ప్రాంతీయవాదం తెరపైకి వస్తుందన్నారు. ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు సాయం ప్రకటించారు. విశ్వక్ సేన్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సాయం ప్రకటించారు. మరి అశ్వినీదత్ కు ఏమైంది. తెలంగాణ నేలపై ఉంటూ.. తెలంగాణకే మొండి చేయి చూపిస్తారా అంటూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.












Click it and Unblock the Notifications