తెలంగాణలో భారీ ఉద్యోగ నియామక ప్రకటన త్వరలోనే: టీజీవో నేతలతో కేసీఆర్ స్పష్టత
హైదరాబాద్: జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు అనంతరం ఏర్పడే ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకుని భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రకటన ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు వివరాలను సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం గెజిటెడ్ అధికారుల సంఘం తెలిపింది.
టీజీవో అధ్యక్షురాలు మమత, గౌరవాధ్యక్షుడు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టీజీవో నేతలు సీఎం కేసీఆర్‌ను గురువారం ప్రగతి భవన్‌లో కలిశారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఉద్యోగులందరూ సహకరించాలని సీఎం కోరినట్లు వారు తెలిపారు.

ఉద్యోగులకు ఐచ్చికాలు ఇచ్చి సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలకు కేటాయిస్తారని, అందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని టీజీవోలు తెలిపారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల చేయాలని వారు ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలుసుకుని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి వల్లనే నిరుద్యోగులకు 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి అని టీజీవోలు స్పష్టం చేశారు.
17న తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలు
హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం 2021-22 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలను నవంబర్ 17న నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వివిధ కోర్సులను దరఖాస్తులను స్వీకరించారు.
బీఎఫ్ఏ, ఎంఏ( తెలుగు, హిస్టరీ, జ్యోతిష్యం, జర్నలిజం, కల్చర్ అండ్ టూరిజం ) కోర్సులకు యూనివర్సిటీ ప్రాంగణంలోనే ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీ నుంచి www.teluguuniversity.ac.in లేదా www.pstucet.org వెబ్‌సైట్ల ద్వారా హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications