తెలంగాణాకు కొత్త టెన్షన్: కరోనాతో పాటు డెంగ్యూ కలిసి కోవిడెంగ్యూ కేసుల నమోదుతో పరేషాన్
తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అసలే కరోనా మహమ్మారి దెబ్బకు వణికిపోయిన జనం ఇంకా పోస్ట్ కోవిడ్ సమస్యలతో సతమతం అవుతూనే ఉన్నారు . ఇంకా కరోనా తర్వాత సమస్యల నుండి కోలుకోకముందే ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భయం పట్టుకుంది. అంతే కాదు షాకింగ్ గా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి బారిన పడిన రోగులలో డెంగ్యూ వైరస్ విజృంభిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం కోవిడెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని, ఇది కోవిడ్-19 రోగికి డెంగ్యూ వైరస్ సోకినప్పుడు సంభవిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుత ఈ పరిస్థితులు తెలంగాణ ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. అప్రమత్తంగా లేకుంటే అత్యంత ప్రమాదం అంటున్నారు వైద్యులు.

తెలంగాణాలో టెన్షన్ పెడుతున్న కోవిడెంగ్యూ కేసులు
కోవిడెంగ్యూ అనేది సిండమిక్ వ్యాధి అని , ఇది మరింత ప్రమాదకరమైనదని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ లోనే కోవిడెంగ్యూ కేసులు ఏడెనిమిది వరకు ఉన్నాయని హైదరాబాద్‌లోని హీలియోస్ ఆసుపత్రి డాక్టర్ విజయ్ భాస్కర్ తెలిపారు. కోవిడెంగ్యూ అనేది ఒక వ్యక్తిలో డెంగ్యూ మరియు కోవిడ్ 19 సంక్రమణ రెండు చోటు చేసుకున్నప్పుడు వచ్చే వ్యాధి అని పేర్కొన్నారు. ఇది కోవిడ్-19 సంక్రమణను సూచించే కొత్త వైద్య పరిభాష అని వెల్లడించారు.

కోవిడెంగ్యూ పట్ల అలెర్ట్ గా ఉండాలంటున్నవైద్యులు
గత మూడు నెలల కాలంలో ఒకే లేబరేటరీలో 1700 డెంగ్యూ కేసులు నిర్ధారణ కాగా వాటిలో, 47 కోవిడెంగ్యూ కేసులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
కోవి డెంగ్యూ రోగులను ఐసియులో తప్పకుండా చేర్చాలని వెల్లడించారు. మేము కోవిడ్-19 కోసం యాంటీవైరల్ చికిత్సను అందిస్తామని, రక్తంలో ప్లేట్‌లెట్ తగ్గితే, అప్పుడు మేము రక్త మార్పిడికి అనుబంధంగా ప్లేట్‌లెట్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేస్తామని పేర్కొన్నారు. ఈ సిండమిక్ వ్యాధికి రోగలక్షణ చికిత్స, అలాగే ఆసుపత్రిలో చేరడం మరియు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సంరక్షణ తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.

కోవిడ్ తో పాటు డెంగ్యూ ఉంటే కోవి డెంగ్యూ .. లక్షణాలను బట్టే చికిత్స
కోవిడెంగ్యూ అనేది కోవిడ్-19 మరియు డెంగ్యూ అనే రెండు వ్యాధుల కలయిక ఒకేసారి వస్తుంది మరియు రెండు వ్యాధులకు నిర్దిష్ట చికిత్స లేదు కాబట్టి లక్షణాలను బట్టి వైద్యం చేస్తామని వెల్లడించారు. ఈ సిండమిక్ వ్యాధి యొక్క లక్షణాలు చర్మంపై మచ్చలు, బాధ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చలి, ఒళ్ళు నొప్పులు మరియు కీళ్ల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి అని వైద్యులు తెలిపారు. కోవిడ్ -19 మరియు డెంగ్యూ ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. బహుశా రుచి కూడా కోల్పోవచ్చు, "అని హైదరాబాద్‌లోని అపోలో టెలిహెల్త్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అయేషా నజ్నీన్ అన్నారు.

అలెర్ట్ గా ఉండాల్సిన అవసరం .. దీర్ఘకాలిక వ్యాధులు, కోవిడ్ ఉన్నవారు జాగ్రత్త
మూడు-నాలుగు రోజుల తర్వాత కోవిడెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వీలైనంత త్వరగా వైద్యుల సలహా మరియు వైద్య సంరక్షణ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. తాము రోగనిరోధక శక్తి తగ్గిన కోవిడెంగ్యూ రోగులను, దీర్ఘకాలిక వ్యాధులు లేదా వృద్ధాప్యంలో ఉన్నవారిని చూశామని పేర్కొన్నారు. కోవిడ్-19 మరియు డెంగ్యూ పరీక్షలు రెండూ పాజిటివ్‌గా ఉన్న కేసులు కూడా నమోదు అవుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications