వెదర్ అలర్ట్: తెలంగాణలో రానున్న 3 రోజులపాటు వర్షాలు: తీవ్రమైన ఎండలు, వడగాలులు కూడా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులకు వాతావరణ సూచనలను చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని వెల్లడించింది.
గురువారం ఆదిలాబాద్, ఖమ్మం, ములుగు, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాలులు వచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఆరు బయట పనులు చేసుకోవాలని.. శరీరానికి వేడి తగలకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తలకు టోపీ, రుమాలు చుట్టుకోవాలని సూచిస్తున్నారు. మంచినీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరోవైపు, జూన్ నెల 10 వరకే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉండగా.. ప్రతికూల పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. గుజరాత్ తీరంలో బిపర్జోయ్ తుఫాను తీరం దాటనున్న క్రమంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గుజరాత్ రాష్ట్రంలో తుపాను కారణంగా ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications