తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు: భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు, పలు ప్రాజెక్టులు కూడా నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. తాజాగా, మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు చేసింది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్తున్న కొద్ది ఆగ్నేయం వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భారీ వర్షాలు, వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 46న్నర అడుగులు దాటి ప్రవహించగా ప్రస్తుతం అది 48 అడుగులకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తాజాగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగుల స్థాయికి చేరడంతో పలు గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం వద్ద గోదావరి వరద 73 అడుగుల స్థాయిని తాకితే పరవాహక ప్రాంతాల్లో 109 గ్రామాలతో పాటుగా భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందన్నారు.
#WATCH | Telangana: Bhadrachalam Revenue Divisional Officer issued a fax message to Bhadrachalam ITDA Project Officer and Bhadradri Kothagudem Collector & District Magistrate stating that the Godavari water level has reached 48ft at Bhadrachalam today.
— ANI (@ANI) July 22, 2024
Second warning has been… pic.twitter.com/1aWbmcViSr
ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏ స్థాయిలో ఏ గ్రామం ప్రభావితమవుతుందనే వివరాలను నీటిపారుదలశాఖ పోర్టల్లో ఉంచినట్లు ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ తెలిపారు. గోదావరి, కృష్ణా పరీవాహకాల్లోని ప్రాజెక్టుల వద్ద ఇంజినీర్లను అప్రమత్తం చేశామన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications