ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలను మరింత వేగవంతం చేసే గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుభవార్త. ఖమ్మం జిల్లా నుంచి దేవరపల్లి వరకు నిర్మించిన ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి NH-365BG వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ మార్గంపై వాహనాల రాకపోకలు పెరుగుతూ ఉండగా, త్వరలోనే అధికారిక ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
గ్రీన్ ఫీల్డ్ హైవే పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఖమ్మం సీపీ
ఇటీవల ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ వైరా సమీపంలో ఈ హైవేను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రస్తుతానికి దేవరపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు వైరా వద్ద ప్రధాన రహదారిలో కలుస్తుండగా, ఏపీ వైపు వెళ్లే వాహనాలు వైరా నుంచే హైవేలోకి ప్రవేశిస్తున్నాయి. వాహనదారులకు ఎటువంటి అయోమయం లేకుండా ఉండేందుకు కీలక జంక్షన్‌ల వద్ద స్పష్టమైన సైన్‌బోర్డులు సైతం ఏర్పాటు చేశారు.

టోల్ ఫీజు లేకుండా ప్రయాణించే సువర్ణావకాశం
ప్రయాణికులకు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ హైవేపై మొదటి 15 రోజుల పాటు టోల్ ఫీజు లేకుండా ప్రయాణించే సువర్ణావకాశం కూడా కల్పించారు. అనంతరం టోల్ ప్లాజాల వద్ద సాధారణ రుసుములు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ రహదారి రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను గణనీయంగా మెరుగుపరచనుంది.
ఈ హైవే స్పెషాలిటీ ఇదే
ఇంజినీరింగ్ పరంగా కూడా ఈ హైవే చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం నాలుగు లేన్‌ల యాక్సెస్ కంట్రోల్ రహదారిగా నిర్మించినప్పటికీ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆరు లేన్‌లకు విస్తరించేలా ఈ ఎన్ హెచ్ రూపకల్పన చేశారు. ప్రతి 18 కిలోమీటర్లకు ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు, ప్రతి 5 కిలోమీటర్లకు అత్యవసర మీడియన్ ఓపెనింగ్స్ ఏర్పాటు చేశారు. రహదారి పొడవునా బారికేడింగ్‌తో పాటు ఏఐ ఆధారిత సీసీ కెమెరా నిఘా కూడా ఉంటుంది.
రైతులకు ఈ హైవేతో చాలా లబ్ది
ఈ మార్గంలో 10 ప్రధాన వంతెనలు, 295 కల్వర్టులు, 98 అండర్‌పాస్‌లు నిర్మించారు. అత్యవసర పరిస్థితుల్లో 1033 హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. ప్రత్యేకంగా తల్లంపాడు వద్ద ఎగ్జిట్ ఉండటం వల్ల స్థానిక రైతులు, వ్యాపారులకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. గిడ్డంగులు, లాజిస్టిక్ హబ్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఇది దోహదపడనుంది.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ప్రయాణం సులభం
మొత్తంగా, ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ప్రయాణం మరింత సులభం కానుంది. దూరం సుమారు 80 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా, దాదాపు రెండు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్యం, రవాణా రంగాలకు ఇది మరింత ఊతం ఇస్తుంది..












Click it and Unblock the Notifications