తెలంగాణలో పిడుగుపాటుకు 9 మంది మృతి: విస్తారంగా వర్షాలు, ఉరుములుమెరుపులు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలపై చురుకుగా కదులుతుండటం, అల్పపీడనాలు, ఆవర్తన ద్రోణులతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. పిడుగులు పడటంతో రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షం పడింది. పలు ప్రాంతాల్లో గురువారం కూడా వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనేకాగా, దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో వచ్చిన వరదనీటితో ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర జలపాతం పొంగిపొర్లుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం నుంచి కురుస్తున్న వర్షాలతోపాటు పిడుగులు పడటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఇద్దరు, ఖమ్మం ఒకరు పిడుగుపాటుకు బలయ్యారు. కుంటాల మండలం విట్టాపూర్‌లోవిజయ్ తానూర్ మండలం కొలుర్ లో మాధవరావు పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడేవున్న విజయ్ భార్యకు తీవ్రగాయాలయ్యాయి.
దీంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. కూచులపూర్‌లో కారం లక్ష్మణ్ అనే రైతు మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. భారీ వర్షాలు, పిడుగుపాటు కారణంగా పదుల సంఖ్యలో మూగజీవాలు చనిపోయాయి.
Recommended Video
కాగా, మరో రెండు రోజులపాటు గురువారం, శుక్రవారాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు వరదనీటితో నడిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications