పవన్ కల్యాణ్ వీరాభిమాని 'నిరంజన్' మృతి.. ఆ కోరిక తీరకుండానే..
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్(17) మృతి చెందాడు. హనుమకొండ జిల్లాలోని హనుమాన్ నగర్ కు చెందిన నిరంజన్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరోవైపు జూన్ 17 న నిరంజన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించిన విషయం తెలిసిందే. నిరంజన్ కోసం ఓజీ 2 షూటింగ్ ను పూర్తి చేస్తానని ఫస్ట్ తనకే చూపిస్తానని పవన్ కల్యాణ్ ఆ బాలుడికి హామీ ఇచ్చారు. ఇక నిరంజన్ మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే జనసేన నేతలు, స్థానికులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
హనుమాన్‍నగర్ కు చెందిన పొనుగోటి రామ్ గోపాల్, మాసన దంపతుల కుమారుడు నిరంజన్ మూడో ఏట నుంచే డ్యూచెన్ మస్య్కులర్ డిస్ట్రోఫి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. మూడో ఏట నుంచే మంచానికి పరిమితమైన నిరంజన్ ఈ వ్యాధి ప్రభావం కారణంగా 17 ఏళ్ల వయసు వచ్చినా కూడా కేవలం నాలుగేళ్ల చిన్నారి రూపంలోనే ఉండిపోయాడు. ఇక పవన్ కల్యాణ్ అంటే నిరంజన్ కు ప్రాణం. ఏదో ఒకరోజు తన అభిమాన హీరోను కలవాలన్న ఆశతో ఉండేవాడు. ఆరోజు కోసం ఎదురు చూశాడు.

ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ గత నెల 17 న నిరంజన్ నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉండాలని తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. నిరంజన్ కు తనపై ఉన్న ప్రేమ, ఇష్టాన్ని చూసి పవన్ కల్యాణ్ ఆశ్చర్య పోయారు. నిరంజన్ కు కొద్దిసేపు మాట్లాడారు. తన అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జనసేనకు సంబంధించిన డైరీలో 'ప్రియమైన నిరంజన్ కు ప్రేమతో.. ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ.. పవన్ కల్యాణ్' అని రాసి సంతకం చేసిచ్చారు.












Click it and Unblock the Notifications