ఉగ్రవాదులకు అడ్డాగా నిజామాబాద్: టీఆర్ఎస్, ఎంఐఎంపై ఎంపీ అరవింద్ సంచలనం
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని తాను సంవత్సరం క్రితమే పార్లమెంటులోనూ ప్రస్తావించినట్లు తెలిపారు.దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యకర్తలను కేంద్ర దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారని.. అందులో నిజామాబాద్ పట్టణానికి చెందిన కొందర్ని అరెస్టు చేశారని గుర్తు చేశారు.

టీఆర్ఎస్, ఎంఐఎం పాత్ర అంటూ ఎంపీ అరవింద్
సంవత్సరం కిందట నిజామాబాద్‌లో దొంగ పాస్‌పోర్టులు ఇచ్చారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. బోధన్ నుంచి ఒకే చిరునామాతో పాస్‌పోర్టులు ఇచ్చారని.. ఇందులో టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేల పాత్ర ఉందన్నారు. ఇదే విషయం అమిత్ షా, డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ఐఏ అధికారులు వచ్చి దర్యాప్తు చేయాలని కోరారు.

బీఆర్ఎస్ తోపాటు ఇండియా మ్యాపును మార్చేశారన్న ఎంపీ
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరుతో టీఆర్ఎస్ దేశం మ్యాప్ మార్చారని మండిపడ్డారు. పార్టీ పేరుతోపాుట ఇండియా మ్యాపును కూడా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బతికున్నంత వరకు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారదన్నారు. కవితను బీఆర్ఎస్‌లో క్రియాశీలకంగా ఉంచాలని తాను కోరుకుంటున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.

రేవంత్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నట్లంటూ అరవింద్ సెటైర్లు
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే పోటీ ఉంటుందన్నారు అరవింద్. మునుగోడులో గెలిచేది బీజేపీ పార్టీయేనని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారంటూ చేస్తున్న ప్రచారంపైనా ఆయన స్పందించారు. రాజగోపాల్ 20 ఏళ్ల కిందటే కాంట్రాక్టర్ అని.. కానీ కేసీఆర్ మాత్రం అప్పట్లో పాస్‌పోర్ట్ బ్రోకర్‌గా పనిచేసేవాడన్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగాలు వింటే గులాబీ శాలువా కప్పుకున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు అరవింద్. రాష్ట్రంలో ముందస్తు వచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. పార్టీ నిర్ణయం మేరకు తాను పోటీ చేస్తానన్నారు.

కేసీఆర్ వైఖరి కారణంగానే ప్రజలు, రైతులకు అన్యాయమన్న ఎంపీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతంలో పాదయాత్ర చేయాలని అరవింద్ సూచించారు. తెలంగాణకు కేంద్రం 17 ఇథనాల్ ఫ్యాక్టరీలో ఇచ్చినా.. కేసీఆర్ ప్రారంభించలేదని మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే న్యాయం జరుగుతుందని, పసుపు రైతులు భావిస్తున్నారని.. అందుకే వారితోపాటు రైతు ప్రతినిధులు బీజేపీలో చేరుతున్నారని అరవింద్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే పసుపు రైతులకు డబ్బులిస్తామని కేంద్రం చెప్పినా.. కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లాలో పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.