మహిళకు టికెట్ కొట్టిన కండక్టర్: సజ్జనార్ సీరియస్, తర్వాత ఏం జరిగిందంటే?
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి చెందిన మహిళలందరికీ రాష్ట్రంలో ఎక్కడ్నుంచి ఎక్కడైకైనా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నారు. టీఎస్ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకం అమలవుతోంది.
అయితే, తాజాగా, ఆదివారం రోజున ఓ కండాక్టర్ మహిళకు టికెట్ తీసుకున్న ఘటన వెలుగుచూసింది. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో ఓ మహిళకు టికెట్ కొట్టాడు కండక్టర్. ఉచిత బస్సు పథకం అమలవుతోందని చెప్పినప్పటికీ.. ఆ కండక్టర్ వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఆ కండక్టర్ వ్యవహారాన్ని వీడియో తీసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో సదరు కండక్టర్‌పై సీరియస్ అయ్యారు ఎండీ సజ్జనార్. విచారణకు ఆదేశించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 'నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో ఒక మహిళకు టికెట్ జారీ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించాం. సంబంధిత కండక్టర్ ను డిపో స్పేర్ లో ఉంచడం జరిగింది. విచారణ అనంతరం ఆయనపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది' అని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, సదరు కండక్టర్‌పై సంబంధిత డీపో మేనేజర్ సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
తెలంగాణ వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి రావడంతో మహిళలంతా ఉచిత ప్రయాణం చేశారు. ఉచిత ప్రయాణం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకంపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ప్రశంసలు కురిపించారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. కరోనా సమయంలో దెబ్బతిన్న ఆర్టీసీ వ్యవస్థ ఈ పథకం ద్వారా పుంజుకుంటుందన్నారు. ఇలాంటి పథకం వల్ల అందరూ బస్సులో ప్రయాణించడానికి ముందుకు వస్తారని, దానివల్ల ప్రజా రవాణా శాతం కూడా పెరుగుతుందని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల స్వయం శక్తి మెరుగవుతుందన్న ఆయన ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయని వివరించారు.












Click it and Unblock the Notifications