కాంగ్రెస్ అవమానించింది!: తమ్మినేని, సీపీఎం ఒంటరిగానే ఆ 17 స్థానాల్లో పోటీ
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని వేచిచూసినప్పటికీ.. ఆ పార్టీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయించుకుంది సీపీఎం పార్టీ. కాంగ్రెస్ పార్టీతో తమకు పొత్తు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
24 స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. 17 స్థానాల్లోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తమ్మినేని తెలిపారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా గెలవకూడదనే తమ సిద్ధాంతమన్నారు. తాము పోటీ చేయని స్థానాల్లో బీజేపీని ఓడించే అవకాశం ఉన్నవారికి మద్దతు ఇస్తామని తమ్మినేని తెలిపారు.

కమ్యూనిస్టులకు ప్రాతినిథ్యం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మిర్యాలగూడ, హైదరాబాద్‌లో ఒక స్థానం ఇస్తామని చేప్తోందని తమ్మినేని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే చెరొక మంత్రి పదవి ఇస్తామంటున్నారని.. ఇది పొత్తులు పోగేసే పద్ధతి కాదని మండిపడ్డారు. తాము కోరిన స్థానాలకు కాంగ్రెస్ అభ్యంతరం తెలిపిందన్నారు.
అయినప్పటికీ, పట్టుదలకు పోకుండా భద్రచలం, మధిర స్థానాలను వదులుకున్నామని చెప్పారు. తమతో కాంగ్రెస్ పొత్తు వద్దని భావిస్తున్నట్లుందని తమ్మినేని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల వైఖరి.. తమ పార్టీ నేతలను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవమానకరంగా పొత్తులు అవసరం లేదన్నా. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వని కాంగ్రెస్ పొత్తు ఉండదని తమ్మినేని స్పష్టం చేశారు.
CPM announced the list of seats they are going to contest in #Telangana pic.twitter.com/rLxiqIe6Wr
— 🅺🅳🆁 (@KDRtweets) November 2, 2023
కాగా, భద్రాచలం, అశ్వరావుపేటలో పోటీ చేస్తామని తమ్మినేని తెలిపారు. నల్గొండ నుంచి 3 స్థానాల్లో, సూర్యాపేట నుంచి 2 సీట్లలో పోటీ చేస్తామన్నారు. నకిరేకల్, భువనగిరి పోటీ చేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి నుంచి పోటీ చేస్తామన్నారు. హుజూర్‌నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, ముషీరాబాద్‌లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు, సీపీఎంతో కలిసి పోటీ చేయాలని సీపీఐ భావిస్తోంది.












Click it and Unblock the Notifications