వ్యాక్సిన్ల కొరత: తెలంగాణకూ షాక్ -గ్లోబల్ టెండర్లకు ఒక్క బిడ్ కూడా రాలేదు -మిగతా రాష్ట్రాలదీ అదే దుస్థితి
కరోనా మహమ్మారి రెండో దశ ఉధృతి ప్రస్తుతానికి తగ్గినా, అందరికీ వ్యాక్సిన్లు వేయకుంటే త్వరలోనే ప్రమాదకర మూడో దశ విలయం వస్తుందన్న నిపుణులు హెచ్చరిస్తుండగా, దేశంలో వ్యాక్సిన్ల కొరత ఇబ్బందికరంగా మారింది. జనాభాలో పెద్ద గ్రూపైన 18-44 ఏళ్ల వ్యక్తులకు టీకాలు అందించే బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం చేతులెత్తేయడం, సరిపడా టీకాలను కూడా కేంద్రం సరఫరా చేయకపోవడంతో దాదాపు అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి. కానీ..
అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణకు కూడా షాక్ తగిలింది. కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించగా ఎలాంటి స్పందన రాలేదు. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు శుక్రవారం సాయంత్రంతో ముగియగా.. ఒక్కటంటే ఒక్క ఫార్మా సంస్థ కూడా బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు రాలేదు. రాష్ట్రాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందేనని అంతర్జాతీయ సంస్థలు, దేశీ ఫార్మా సంస్థలు కోరుతుండటంతో రాష్ట్రాల టెండర్లకు స్పందన కరువైంది.

కొవిడ్ టీకాలు గ్లోబల్ టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని కేసీఆర్ సర్కారు గత నెలలో నిర్ణయించింది. ఈమేరకు గత నెల 26న ప్రీబిడ్ సమావేశం నిర్వహించగా.. ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్-వి కంపెనీల ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. అయతే, బిడ్ల దాఖలుకు సంబంధించిన గడువు ఈరోజు సాయంత్రం 6గంటలకు ముగియగా ఏ ఒక్క కంపెనీ కూడా బిడ్ దాఖలు చేయలేదు. తెలంగాణ వైద్య శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కేరళ, పంజాబ్ తదితర రాష్ట్రాలు టీకాల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలిచినా ఫార్మా సంస్థల నుంచి స్పందన లేని విషయం తెలిసిందే. గ్లోబల్ టెండర్ల ప్రయోగం విఫలమైన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల సీఎంలు.. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిస్తూ వరుసగా లేఖలు రాస్తున్నారు. వ్యాక్సిన్లను కేంద్రమే సేకరించి, రాష్ట్రాలకు సరఫరా చేసేలా మోదీ సర్కారుపై ఒత్తిడి తెద్దామంటూ సీఎంలు కోరుతున్నారు. రాష్ట్రాల టెండరింగ్ ప్రక్రియలు విఫలం అవుతుండటంపై కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు.












Click it and Unblock the Notifications