కెసిఆర్‌కు చెప్పే స్థాయి నాది కాదు: కవిత, పాక్ ఆర్టిస్టులపైనా..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గంలో మహిళలుంటే బాగుంటుందని, అయితే కేసీఆర్‌కు చెప్పే స్థాయి తనది కానది ఆయన తనయ, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వం మహిళల కోసం పెద్ద పీట వేస్తోందని, చాలా కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు.
దేశభక్తిని చాటుకోవాల్సిన సమయంలో టోకనిజం పని చేయదని ఆమె అన్నారు. పాకిస్తాన్ ఆర్టిస్టులను తీసుకునే విషయంలో బాలీవుడ్ పునరాలోచన చేయాలని ఆమె అన్నారు. పాకిస్తాన్ పదే పదే దేశంపై దాడికి పూనుకున్న ఈ అయోమయ స్థితిలో బాలీవుడ్ పాకిస్తానీ ఆర్టిస్టులతో పనిచేయడం సరికాదని అన్నారు. క్రీడాకారులు పాకిస్తాన్‌తో ఆడడాన్ని నిరాకరిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
భారతదేశంలో ఆర్టిసులకు కొదవ లేదని, ఈ సమయంలో బాలీవుడ్ ఆర్టిస్టులు దేశం కోసం నిలబడాలని ఆె అన్నారు. అందరూ రాజకీయ నాయకులై పోయారని ఆమె అన్నారు.

మా గురించి మాట్లాడేది వారా..
తమ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని కల్వకుంట్ల కవిత అన్నారు. బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తే తమ్మినేని రాజకీయం చేశారని ఆమె అన్నారు. చిన్న జిల్లాలపై లోకేశ్‌వి అవగాహన లేని వ్యాఖ్యలని ఆమె అన్నారు. కొత్త సచివాలయం పాలనా సౌలభ్యం కోసమేనని అన్నారు. మహిళలకు ప్రత్యేక బడ్జెట్‌పై ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు.

ఆ పార్టీలకు పతనం తప్పదు...
ప్రజల్లో లేని పార్టీలకు పతనం తప్పదని, తమది ప్రజల్లో ఉండే పార్టీ అని, ప్రజలకు దగ్గరగా ఉంటేనే గెలిపిస్తారని కల్వకుంట్ల కవిత అన్నారు. తాము ఎక్కడ ఉండాలో ప్రజలే చెప్తారుని,, 2019లో కచ్చితంగా విజయం టీఆర్‌ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు .భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతాంఅన్నారు.

ప్రతిపక్షాలకు 7,8 సీట్లే వస్తాయి..
ప్రతిపక్షాలకు 7-8 సీట్లే వస్తాయని సర్వేల్లో తేలినట్లు వార్తలొచ్చాయని, సహజంగా ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకోడానికి సర్వేలు చేస్తారని, సర్వేల్లో వాస్తవాలు బయటకు వచ్చాయని కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి కవిత హాజరయ్యారు.

జానారెడ్డిపై కవిత విసుర్లు
సీఎల్పీ నేత కె జానారెడ్డి ప్రజలను మభ్యపెట్టే పనులు మానుకోవాలని కవిత అన్నారు. ఏ సమాచారం కావాలన్నా ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. రెండున్నరేళ్లలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు స్వర్ణయుగం వచ్చిందని, ఇది ఇలాగే కొనసాగాలని ఆమె ఆకాక్షించారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు అన్ని రంగాల్లో పనిచేస్తున్నారన్నారు.

ప్రాచీన హోదా సంతోషం
తెలుగుకు ప్రాచీన హోదా సంపాదించడం సంతోషంగా ఉందని కవిత చెప్పారు. తన కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని కవిత మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, తాను ప్రతిరోజూ పాల్గొన్నామని ఆమె గుర్తుచేశారు. దేశంలో యూపీ నుంచి మొదలు పెడితే ఏపీ వరకు కుటుంబ రాజకీయాలున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌లో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అంతా ఒకే కుటుంబమని గుర్తు చేశారు.

విశ్వవ్యాప్తంగా బతుకుమ్మ
తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేక్రమంలో ఈ సంవత్సరం విదేశాల్లో ఎంతో అద్భుతంగా బంగారు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించామని కవిత చెప్పారు. చార్మినార్ రూపంలో కూడా బతుకమ్మను తయారుచేశారని, అన్ని నగరాల్లోనూ మేయర్లు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు హాజరై మన సంస్కృతిని గౌరవించారని తెలిపారు. కాలిఫోర్నియా సిటీ మేయర్ 10500 డాలర్లు తెలంగాణ సంఘాలకు విరాళంగా ఇచ్చారని చెప్పారు. విదేశీ ప్రభుత్వాలు కూడా తెలంగాణ సంస్కృతి గొప్పదనాన్ని గుర్తించి, గౌరవించాయన్నారు.

కాలిఫోర్నియాలో బతుకమ్మ అలా...
కాలిఫోర్నియాలో ప్రజలు భారీ సంఖ్యలో రావడంవల్ల గేట్లు మూసేయాల్సి వచ్చిందని కవిత చెప్పారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఉత్సవాలకు కూడా అక్కడి ప్రజాప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. కొందరు ఆస్ట్రేలియా మహిళలు చీరలు కట్టుకునివచ్చి బతుకమ్మ అడారని చెప్పారు. ఆస్ట్రేలియా పూలపై రూపొందించిన పుస్తకాన్ని అందించారని తెలిపారు. న్యూజిల్యాండ్‌లో మూడేళ్ల పాప బతుకమ్మ ఆడిందని, తెలంగాణ సంస్కృతి వారసత్వం కొనసాగుతున్నదనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.

కువైట్‌లో కూడా ఇలా..
కువైట్‌లో ఆ దేశ సంస్కృతీ, సంప్రదాయాలను తప్ప మరేదీ అంగీకరించరని కవిత చెబుతూ అయినా అక్కడి తెలంగాణ బిడ్డలు బతుకమ్మ కోసం ప్రాణాలను పణంగా పెట్టారని కవిత ప్రశంసించారు. బహ్రెయిన్‌లో 10వేల మంది కార్మికులు తరలివచ్చారని, పెద్ద బహిరంగసభలా బతుకమ్మ ఉత్సవం సాగిందని, డెన్మార్క్‌లోనూ పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మన సంస్కృతిని ఆస్వాదించారని వెల్లడించారు.

దానికి కాంగ్రెసే కారణం.
రాజకీయాలు ఇంత నీచస్థాయికి దిగజారడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ కవిత అన్నారు. కెసిఆర్ ప్రభుత్వంపై వ్యాఖ్యలుచేసే అర్హత దిగ్విజయ్‌సింగ్‌కు లేదని అన్నారు. దిగ్విజయ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ పార్టీలోని వారే ఆయన్ను తిడతారని కవిత అన్నారు.

నేను ఫోన్ చేస్తే ఇలా.
సీపీఎం నేత తమ్మినేనికి బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేశానని కవిత చెప్పారు. ప్రతి బతుకమ్మ పండుగకు అన్ని పార్టీల నేతలకు ఫోన్ చేసి మాట్లాడుతానని అన్నారు. తమ్మినేని దీన్ని కూడా రాజకీయం చేశారని, అదీ ఆయన రాజకీయ విజ్ఞత కవిత అన్నారు. తెలంగాణకు సీపీఎం ఎప్పుడూ వ్యతిరేకమేని అన్నారు.

మాంసం తిన్నామని బొక్కలు
ఆస్తులు ప్రకటించడం అనేది మాంసం తిన్నామని బొక్కలు మెడలోవేసుకుని తిరుగడమేనని కవిత నారా లోకేష్ ఆస్తులు ప్రకటించడంపై అన్నారు. ఆస్తుల వెల్లడిపై మాకు ఎవరి సలహాలూ అవసరం లేదని, ప్రతి సంవత్సరం ఆదాయం పన్ను కడుతున్నామని, అన్ని వివరాలు ఐటీశాఖ వద్ద ఉంటాయని అన్నారు. ఆస్తులు ప్రకటించి అన్నా హజారే బిరుదులు పొందాల్సి అవసరం తమకు లేదని అన్నారు.












Click it and Unblock the Notifications