హైదరాబాద్ వాన ముప్పు: రూ. 10 వేల కోట్ల 'ఎన్వోసి' గండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రధాన నాలాలపై అక్రమంగా వేల నిర్మాణాలు వెలిశాయి. నీరు పారే దారిలేక, ఐదారు సెంటీమీటర్ల వర్షాలకే కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇలాంటి ప్రాంతాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి.
ముడుపులు స్వీకరించి నాలాల పక్కన నిర్మాణాలు చేపట్టేందుకు సాగునీటిశాఖ అధికారులు నిరభ్యంతర ప్రతాలలివ్వడం, వీటి ఆధారంగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) కూడా అనుమతులివ్వడం ఏళ్ల తరబడి తంతుగా సాగిపోయినట్లు తాజాగా తేలింది. దీంతో కొద్దిపాటి వాన జల్లులకే నగరం హడలెత్తిపోతోంది!
రాజధాని నగర పరిధిలో 390 కిలోమీటర్ల మేర వందేళ్ల నాటి 173 ప్రధాన నాలాలు ఉన్నాయి. సుమారు 183 చెరువులను అనుసంధానిస్తూ వాటి విస్తీర్ణం, ఎత్తు ఆధారంగా వీటిని నిర్మించారు. ఫలితంగా ఒక చెరువు నిండగానే, మరో చెరువులోకి వరద వెళ్లేది. నిజాం హయాంలో చాలా ప్రధాన కాలువలు 100 - 200 అడుగుల వెడల్పు ఉండేవి. ఆ తర్వాత చేపట్టిన పట్టణ సర్వేలో నాలా స్థలాలను ప్రత్యేక సర్వే నంబర్ల కింద చూపనేలేదు. ఉన్న ఆధారాలను బట్టి నాలాల తాజా రికార్డును తయారు చేయడంలో బల్దియా అధికారులు విఫలమైనట్లు నిపుణులు అంటున్నారు.

బఫర్ జోన్‌లో ఉంటే నో పర్మిషన్
నిబంధనల ప్రకారం... వీటికి రెండు వైపులా భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన ‘బఫర్ జోన్'కు ఆవలే నిర్మాణాలు చేపట్టాలి. జీహెచ్‌ఎంసీకి ఏదైనా నిర్మాణం కోసం దరఖాస్తు అందగానే.. ప్రతిపాదిత స్థలం ఎక్కడుందో చూస్తారు. నాలా పక్కదైతే, దరఖాస్తును సాగునీటిశాఖకు పంపుతారు. ఆ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, నిర్మాణ స్థలం నాలా బఫర్ జోన్‌లో ఉంటే అనుమతులు ఇవ్వకూడదు. లేకుంటే ‘నిరభ్యంతర పత్రం' ఇవ్వాలి. కానీ మూడేళ్ల క్రితం వరకు కొందరు సాగునీటిశాఖ అధికారులు అవినీతి విశ్వరూపం చూపారు. ఒక్కో నిర్మాణానికి రూ.5 లక్షల నుంచి పాతిక లక్షలు, ఆ పైన డబ్బులు దండుకుని, నిరభ్యంతర పత్రాలిచ్చేశారు! బల్దియా అధికారులు కూడా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేశారు. నాలాల విస్తరణకు అధికారులు తాజాగా చేపట్టిన సర్వేలో ఈ అక్రమాలన్నీ వెలుగుచూశాయి.

భారీగా కుంచించుకుపోయిన కూకట్ పల్లి నాలా
కూకట్‌పల్లి ధరణినగర్‌లో ప్రారంభమై, బేగంపేట మీదుగా హుస్సేన్‌సాగర్‌లో కలిసే నాలా పరిధి మరీ ఘోరంగా కుంచించుకుపోయింది! ఈ కాలువపై వేల నిర్మాణాలు వెలిశాయి. సాగునీటిశాఖ నిరభ్యంతర పత్రాలువ్వడం, వాటిపై నిర్మాణాలకు బల్దియా అనుమతించడమే ఇందుక్కారణమని తేలింది. మొదట అధికారిక అనుమతులతో ఒక భవనం రావడంతో ఆ వెంటనే నాలాను ఆనుకుని అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. నిరభ్యంతర పత్రాలు ఉన్న భవనాలు కొన్ని సగంమేర నాలా స్థలంలోనే ఉంటే, మరికొన్ని సరిగ్గా కాలువ మధ్యలో ఉన్నట్లు చెబుతున్నారు.

అక్రమ కట్టడాలు తొలగించి.. కాలువలు విస్తరిస్తేనే మోక్షం
కిరోస్కర్ కమిటీ నివేదిక ప్రకారం హైదరాబాద్ అంతటా ప్రధాన నాలాలపై సుమారు 25 వేల అక్రమ నిర్మాణాలున్నాయి. వీటన్నింటిని తొలగించి, నాలా వ్యవస్థను సంస్కరించేందుకు కనీసం రూ.12 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అధికారులు ఇటీవల ప్రధాన నాలాలపై సర్వేచేసి, సుమారు పదివేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. వీటిని తొలగించి, కాలువలను విస్తరిస్తే గాని పరిస్థితిలో మార్పు రాదని తేల్చారు.

కెటిఆర్ హామీ ఇలా...
ప్రస్తుతం రూ.230 కోట్లతో, ప్రవాహానికి అడ్డుగా ఉన్న వెయ్యి అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. అధికారిక అనుమతులు ఉండగా, తమ ఇళ్లను ఎలా కూలుస్తారని వాటి యజమానులు ప్రశ్నిస్తున్నారు. 15 ఏళ్లుగా సాగిన ఈ అనుమతుల తంతుతో- రాష్ట్ర ఖజానాపై రూ.10 వేల కోట్ల మేర నష్ట పరిహార భారం పడబోతోంది. నాలాల సంస్కరణలో భాగంగా, వాటిపై అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టినట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. కాలువలను పూర్తిస్థాయిలో విస్తరించి, కాలనీలకు ముంపు ముప్పు లేకుండా చూస్తామన్నారు.












Click it and Unblock the Notifications