ప్రోటోకాల్ అనేదే లేదు: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు, బిల్లులుపై ఇలా
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రోటోకాల్ పాటించడం లేదని అన్నారు. చాలా కాలంగా సీఎం తనని కలవలేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం గవర్నర్‌తో సీఎం కాలానుగుణంగా చర్చలు జరపడం తప్పనిసరి అని తమిళిసై స్పష్టం చేశారు. కానీ, తెలంగాణలో అలా జరగడం లేదన్నారు.
ముఖ్యమంత్రి తనన గత రెండేళ్లుగా కలవలేదని గవర్నర్ తెలిపారు. గవర్నర్, సీఎంతో సత్సంబంధాలు ఉండాలని తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. ఇది ఇలావుంటే, పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో మూడు బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. వాటిలో తాజాగా ఒకదాన్ని తిరస్కరించి.. మిగిలిన రెండు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరారు.

డీఎంఈ(డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) వయో పరిమితి బిల్లును తిరస్కరించిన గవర్నర్.. మున్సిపల్ నిబంధనలు, ప్రైవేటు వర్సిటీల బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఈ క్రమంలో ప్రస్తుతం గవర్నర్ దగ్గర ఎలాంటి పెండింగ్ బిల్లులు లేవని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
కాగా, తెలంగాణ ఉభయసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రోజున దీనిపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
గత కొంత కాలంగా ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్ పర్యటనల్లో ప్రోటో కాల్ పాటించడం లేదని పలుమార్లు తమిళిసై ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు, గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications